ఆంధ్రప్రదేశ్‌ రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించాలని సీఎం జగన్ దాదాపు రెండేళ్ల క్రితమే నిర్ణయించారు. కానీ.. అది అమల్లోకి రావడం లేదు. ఈ అంశంపై అనేక కోర్టు కేసులు ఉండటంతో విషయం కోర్టుల్లో నానుతోంది. మొదట్లో ఊపుగానే ప్రారంభమైన అమరావతి ఉద్యమం.. ఆ తర్వాత కేవలం 29 గ్రామాలకు పరిమితం అయ్యింది. ఈ లోపే.. విశాఖలో రాజధాని కార్యక్రమాలు ప్రారంభం కావడం.. కర్నూలుకు న్యాయ రాజధాని తరలించే ప్రయత్నాలు జరగడం మనం చూసాం.


అయితే.. ఇటీవల కాలంలో అమరావతి రైతులకు మళ్లీ ఆశలు చిగురుస్తున్నాయి. ఏపీ రాజధానిగా అమరావతే ఉంటుందా.. రాజధాని ఎక్కడకూ వెళ్లదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అమరావతే ఏకైక రాజధానిగా ఉండొచ్చన్న సంకేతాలు రైతులకు కనిపిస్తున్నాయి. ఇటీవల మరోసారి అమరావతి ఉద్యమం వార్తల్లోకి వచ్చింది. న్యాయస్థానం టూ దేవస్థానం పేరుతో రైతులు పాదయాత్ర చేస్తున్నారు.


దీనికి తోడు హైకోర్టులో రాజధాని అంశంపై వాదనలు సాగుతున్నాయి. ఈ సమయంలో జడ్జి చెప్పారంటూ వస్తున్న కొన్ని వ్యాఖ్యానాలు చూస్తుంటే.. అమరావతి ఇక్కడే ఉంటుందేమో అన్న అనుమానం కలుగుతోంది. రాజధాని వ్యాజ్యాలపై విచారణ సందర్భంగా హైకోర్టు ఏర్పాటు విషయంలో సీజే జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర చేసిన వ్యాఖ్యలు ఇందుకు ఊతమిస్తున్నాయి. ఏపీ హైకోర్టు ప్రధాన బెంచ్‌ అమరావతిలో ఏర్పాటు చేసేందుకు రాష్ట్రపతి నోటిఫికేషన్‌ ఇచ్చారని..  దీనిపై మళ్లీ కేంద్రం నోటిఫికేషన్‌ జారీ చేయనంత వరకు అమరావతి నుంచి హైకోర్టు ఎక్కడికీ పోదని ఆయన వ్యాఖ్యానించారు.


అసలు హైకోర్టు లేకుండా కర్నూల్లో న్యాయ రాజధాని సాధ్యం కాదని ఆయన అన్నారని పత్రికల్లో వార్తలు వచ్చాయి. రాజు అంటే హైకోర్టు లేకుండా రాజధాని ఎలా సాధ్యం? అని ఆయన ప్రశ్నించారు. కర్నూల్లో హైకోర్టు ఏర్పాటు చేస్తామని ప్రజలకు హామీ ఇస్తున్నట్లు పాలన వికేంద్రీకరణ చట్టంలో ఉందని.. కానీ అలాంటి హామీని చట్టంలో ఇవ్వొచ్చా అన్నది పరిశీలిస్తున్నామన్నారు. ఈ వ్యాఖ్యలు చూస్తే అమరావతి తరలింపు కష్టమే అన్న అభిప్రాయం కలుగుతోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: