దేశమంతటా ఒమిక్రాన్‌ వేరియంట్‌ విజృంభిస్తోంది. దేశంలో మళ్లీ లక్షల సంఖ్యలో కొత్త కేసులు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. తెలంగాణలో నిన్న ఒక్క రోజే 4 వేల వరకూ కొత్త కేసులు వచ్చాయి. వాస్తవానికి క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉంది. చాలా పరీక్షా కేంద్రాల్లో టెస్టులు పరిమిత సంఖ్యలోనే చేస్తున్నారు. ప్రజలు కూడా ఏమాత్రం దగ్గు, జలుబు వచ్చినా.. పరీక్ష కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. అనుమాన నివృత్తి కోసం పరీక్షా కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు.


ఇలాంటి సమయంలో తెలంగాణ సర్కారు భేషైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి ఫీవర్‌ సర్వే నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సర్వేలో ఆరోగ్య సిబ్బందే ఇంటింటికి వెళ్లి జ్వర లక్షణాలు ఉన్నవారిని గుర్తిస్తారు. ఇంట్లో ఎవరికైనా జ్వరం ఉన్నా.. కరోనా లక్షణాలు కనిపించినా వారికి మందులతో కూడిన కిట్‌ ను అందజేస్తారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కొత్తగా మరో కోటి మందుల కిట్‌లు తయారు చేయించింది. ఈ కిట్‌లో అజిత్రోమైసిన్‌, పారాసిటమాల్‌, లెవో సిట్రిజన్‌ వంటి మందులు ఉంటాయి. వీటితో పాటు రానిటిడైన్, విటమిన్‌ సి, మల్టీ విటమిన్‌, విటమిన్‌ డి మందులు కూడా ఉంటాయి.


తెలంగాణ సర్కారు గతంలోనూ ఇలాంటి జ్వర సర్వేలు నిర్వహించింది. ఇప్పటికే రెండుసార్లు ఫీవర్‌ సర్వే జరిపింది. ఈ సర్వే నాలుగైదు రోజుల్లో పూర్తయ్యేలా అధికారులను మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో ఈ నెలాఖరు వరకు కొవిడ్‌ ఆంక్షలు పొడిగించారు. ఆంక్షలు  పొడిగిస్తూ సాధారణ పరిపాలనశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఒమిక్రాన్‌, కరోనా కేసుల వ్యాప్తి దృష్ట్యా ఈనెల 1 నుంచే రాష్ట్రంలో ఆంక్షలులోకి వచ్చాయి.


ఈ కొత్త ఆంక్షల ప్రకారం తెలంగాణలో ర్యాలీలు, బహిరంగసభలు, మతపరమైన కార్యక్రమాలపై నిషేధం ఉంటుంది. జనం గుమిగూడే రాజకీయ, సాంస్కృతిక కార్యక్రమాలపై నిషేధం ఉంటుంది. ప్రజా రవాణా, దుకాణాలు, మాల్స్, సంస్థలు, కార్యాలయాల్లో కొవిడ్‌ నిబంధనలు అమలు చేయాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: