రాజకీయాల్లో అధికారం శాశ్వతం కాదు. కానీ విచిత్రం ఏంటంటే.. అధికారంలో ఉన్న ప్రతి ఒక్కరూ తామే శాశ్వతంగా అధికారంలో ఉంటామని భ్రమల్లోనే ఉంటాయి. బహుశా అది అధికారంలో ఉన్న మత్తు కావచ్చు. అయితే అధికారం మారినప్పుడల్లా ‌ప్రభుత్వ విధానాలూ మారుతుంటాయి. మారాలి కూడా.. లేకుంటే ప్రభుత్వాన్ని మార్చడం ఎందుకు.. కానీ.. ప్రజానుకూలమైన, ప్రజలకు పనికొచ్చి పనులను కూడా ఆపేయడమో.. మార్చేయడమో చేయడం మాత్రం వివేకం అనిపించుకోదు.


ఏపీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక.. అనేక పాత కార్యక్రమాలను ఆపేశారు. అలాంటి వాటిలో అన్న క్యాంటీన్లు ఒకటి.. కేవలం ఐదు రూపాయలకే పేదలు కడుపు నిండా అన్నం తినే అవకాశం ఈ అన్న క్యాంటీన్ల ద్వారా ఉండేది. కానీ.. జగన్ అధికారంలోకి రాగానే ఈ క్యాంటీన్లను మూయించేశారు. అన్న క్యాంటీన్లు అన్న పేరులో అన్న ఎన్టీఆర్‌ పేరు ఉంది. అది ఇబ్బంది అనుకుంటే రాజన్న క్యాంటీన్లు అని మార్చుకునైనా ఆ క్యాంటీన్లను కొసాగిస్తే బావుండేది. పైగా అదేమీ కోట్లకు కోట్లు ఖర్చయ్యే కార్యక్రమమూ కాదు.


ఏదేమైనా అలాంటి అన్న క్యాంటీన్లను మూయించిన చెడ్డపేరు వైఎస్ జగన్‌ సర్కారుకు వచ్చింది. ఇప్పుడు టీడీపీ ఈ అన్న క్యాంటీన్లపై కొత్త తరహాలో దాడి మొదలు పెట్టింది. ప్రభుత్వం మూసేసినా.. టీడీపీ నేతలు సొంత డబ్బులతో అక్కడకక్కడా అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తున్నారు. తాజాగా గుంటూరు జేకేసీ రోడ్డులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ను టీడీపీ నేత బాలకృష్ణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు ఆలపాటి రాజా, నక్కా ఆనందబాబు, పార్టీ నేతలు కోవెలమూడి రవీంద్ర, నసీర్ అహ్మద్, నాట్స్ మాజీ అధ్యక్షుడు మన్నవ మోహన్ కృష్ణ, తెదేపా కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.


టీడీపీ ఇలాగే మరికొన్ని చోట్ల సొంత డబ్బుతో అన్న క్యాంటీన్లు నడిపితే.. జనం ఆలోచనలో పడతారు. అది చర్చనీయాంశం అవుతుంది. అల్టిమేట్‌గా అది జగన్‌కు చెడ్డపేరు తెస్తుంది. ఈ విషయంలో నిర్ణయం సవరించుకోవడానికి జగన్‌ సర్కారుకు ఇప్పటికీ సమయం ఉంది. ఇకనైనా రాజన్న క్యాంటీన్లు అని పేరు పెట్టయినా వాటిని ప్రారంభిస్తే మంచిది.


మరింత సమాచారం తెలుసుకోండి: