ప్రతిపక్షం అంటే ప్రజల తరపున పోరాడాలి.. ప్రజా సమస్యలను వెలుగులోకి తేవాలి. ప్రజా సమస్యలపై గళమెత్తాలి. ప్రజాపోరాటాలకు మద్దతుగా నిలవాలి. అయితే.. సరైన సమస్యను ఫోకస్ చేసినప్పుడే ప్రతిపక్షానికి రాజకీయంగా కూడా లబ్ది కలుగుతుంది. ఇప్పుడు టీడీపీ రైతుల సమస్యలను హైలెట్ చేస్తోంది. ప్రత్యేకించి కోనసీమ వంటి ప్రాంతంలో రైతులు పంట విరామం ప్రకటించాలని నిర్ణయించారని... ఈ రైతు నిరసనకు మద్దతుగా నిలవాలని భావిస్తోంది.


రైతులు క్రాప్‌హాలీడే విర‌మించేలా త‌క్షణ‌మే ప్రభుత్వం చ‌ర్యలు తీసుకుని రైతుల్ని ఆదుకోవాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  సీఎంకి లేఖ కూడా రాసారు. రైతు రాజ్యం తెస్తాన‌ని జగన్ ప్రభుత్వంలోకి వచ్చారని లోకేశ్ గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రాష్ట్రమంతా క్రాప్‌హాలీడేలు ప్రక‌టించడం వ‌ల్ల రైతుల్లేని రాష్ట్రంగా ఏపీ మారుతోందని టీడీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది.


ఏపీ అంటే దేశానికే ధాన్యాగారంగా అన్నపూర్ణ అనిపించుకున్నరాష్ట్రం. అలాంటి ఆంధ్రప్రదేశ్‌లో వ్యవ‌సాయ‌రంగం ప‌ట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా పంట విరామం ప్రకటిస్తూ రైతులు వ్యవసాయానికి దూరమవడం ఏంటని టీడీపీ ప్రశ్నిస్తోంది. గత ఏడాది కూడా రాష్ట్రంలో కర్నూలు, కడప, ఉభయ గోదావరి జిల్లాల్లో క్రాప్‌ హాలిడే ప్రకటించారని టీడీపీ గుర్తు చేస్తోంది. అప్పుడే రైతుల స‌మ‌స్యలు గుర్తించి ప‌రిష్కారానికి చ‌ర్యలు తీసుకుని ఉండాల్సిందని.. అలా చేస్తే ఈ ఏడాది మ‌రిన్ని ప్రాంతాల్లో క్రాప్ హాలీడే ప్రక‌టించేవారు కాదని టీడీపీ భావిస్తోంది.


అలాగే.. ధాన్యం అమ్మి 4 నెలలు దాటినా డబ్బులు ఖాతాలో జమచేయలేదని.. రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయలేదని.. ఈ ప్రభుత్వం సకాలంలో ఎరువులు, పురుగు మందులు సరఫరా చేయలేదని.. ప్రభుత్వ సబ్సిడీలు నిలిపివేసిందని.. కాలువల ద్వారా నీళ్లందించడంలో నిర్లక్ష్యం చూపిందని.. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోలేదని.. అందుకే రైతులు సాగుకు దూరమవుతున్నారని టీడీపీ భావిస్తోంది. ఈ రైతుల క్రాప్ హాలీడే అంశంపై పోరాటం ద్వారా జగన్‌ను ఇబ్బంది పెట్టాలని టీడీపీ చేస్తున్న ప్రయత్నాలు ఎంత వరకూ ఫలిస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: