ఏపీలో పాఠశాలల విలీనం అంశం వివాదాస్పదంగా మారింది. అనేక జిల్లాల్లో ఈ విలీనాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు. 3,4,5 తరగతులను దూరంగా ఉన్న పాఠశాలల్లో విలీనం చేయడం వల్ల చిన్న పిల్లలు అంత దూరం వెళ్లలేరని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్య పట్ల ఉపాధ్యాయ సంఘాలు కూడా ఆగ్రహంగా ఉన్నాయి. అందుకే.. విలీనానికి అవకాశం కల్పిస్తున్న జీవో 117 ను రద్దు చేసి.. అంగన్‌వాడీలు, పాఠశాలలను యథావిధిగా కొనసాగించాలని యూటీఎఫ్‌ వంటి ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.


ఈ జీవో రద్దు కోసం ఇవాళ్టి నుంచి  31 వరకు ఉపాధ్యాయ సంఘాల నేతలు బస్సు యాత్ర చేపడుతున్నారు. ఈ మేరకు కడపలో నిన్న నిర్వహించిన జిల్లా స్థాయి విద్యా సదస్సులో ఉపాధ్యాయ సంఘ నేతలు తెలిపారు. బస్సు యాత్ర పలాస నుంచి ప్రారంభమై హిందూపురం వరకు కొనసాగుతుందని యూటీఎఫ్‌ నేతలు వివరించారు. నూతన విద్యా విధానాన్ని జీవో నెంబర్ 117 ను రద్దు చేయాలని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మి రాజా డిమాండ్ చేశారు.


అంగన్వాడీలను, ప్రాథమిక పాఠశాలను ప్రస్తుతం ఉన్నట్టుగానే యధావిధిగా కొనసాగించాలని ఉపాధ్యాయ సంఘ నేతలు డిమాండ్ చేశారు. నూతన విద్యా విధానాన్ని, జీవో నెంబర్ 117 ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా యుటిఎఫ్ ఆధ్వర్యంలో వారు జిల్లా స్థాయి సదస్సులు నిర్వహించారు. అందులో భాగంగానే నిన్న కడప యుటిఎఫ్ కార్యాలయంలో కూడా జిల్లా స్థాయి విద్యా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు పలు విద్యార్థి సంఘ నాయకులు  కూడా హాజరయ్యారు.


ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన విద్యా విధానం వల్ల చాలా పాఠశాలలు మూతపడి విద్యార్థులకు విద్య అందని ద్రాక్షావవలె మారుతుందని నేతలు ఆరోపించారు. జీవో నెంబర్ 117 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ్టి నుంచి  31 వరకు ఎమ్మెల్సీ లతో కలుపుకొని బస్సు యాత్రను చేపడుతున్నామన్నారు. ఈ బస్సు యాత్ర శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి ప్రారంభమైంది. ఇది హిందూపురం వరకు కొనసాగుతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి నూతన విద్యా విధానాన్ని జీవో నెంబర్ 117 ను రద్దు చేయాలని నేతలు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: