మన దేశంలో ఆర్థిక అవకతవకలకు పాల్పడితే విచారించే సంస్థల్లో ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ది అగ్రస్థానం.. చాలా సార్లు ఈ  సంస్థ సీబీఐతో కలసి పనిచేస్తుంటుంది. అయితే.. సీబీఐ ఎదుర్కొన్న ఆరోపణలే ఈ సంస్థ కూడా ఎదుర్కుంటోంది. ఇది కేంద్రం చేతిలో అస్త్రంగా మారుతోందని.. విపక్ష నేతలను టార్గెట్ చేసేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ దీన్ని వాడుకుంటోందని విమర్శలు ఉన్నాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే గత పదేళ్లలో మన దేశంలో 24,893 ఫెమా కేసులను ఈడీ నమోదు చేసి ఈడీ విచారణ చేపట్టిందట.


ఈ విషయాన్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ కు తెలిపింది. అదే తరహాలో మనీ లాండరింగ్ చట్టం 2002 కింద మరో 3,985 కేసులు నమోదు చేసినట్లు కేంద్ర ఆర్ధిక శాఖ పార్లమెంటులో తెలిపింది. లోకసభ సభ్యుడు లలన్ సింగ్ అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చిన కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి... 2012-13 నుంచి 2021-22 మధ్య కాలంలో ఈ కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.


ఇక ఈ పదేళ్లలో అత్యధికంగా.... 2021-22 ఏడాదిలో 5,313 కేసులు నమోదయ్యాయట. ఆ తర్వాత 2017-18లో 3,627 ఫెమా కేసులు నమోదు అయ్యాయట. ఇక మనీలాండరింగ్ చట్టం కింద 2021-22 ఏడాదిలో 1180, 2020-21లో 981 కేసులు నమోదు అయ్యాయని.. ఈఏడాది మార్చి 31 నాటికి పిఎంఎల్ఎ కింద మొత్తం 5,422 కేసులు నమోదు చేసి... సుమారు రూ. 1,04,702 కోట్ల జప్తు ప్రక్రియ చేపట్టామని కేంద్రం చెబుతోంది.


ఇప్పటి వరకూ 992 కేసుల్లో ప్రాసిక్యుషన్ పూర్తి చేసి... రూ. 869.31 కోట్లు జప్తు చేశారట. ఇప్పటి వరకూ 23 మంది నిందితులను దోషులుగా తేల్చినట్లు కేంద్రం చెబుతోంది. ఈ ఏడాది మార్చి 31 నాటికి మొత్తం30,716  ఫెమా కేసులను ఈడీ నమోదు చేసిందని.. ఈ కేసుల విచారణలో భాగంగా... 8109 షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు కేంద్రం తెలిపింది. 6472 కేసుల్లో తీర్పులు వెలువడ్డాయని.. రూ. 8130 కోట్లు జరిమానా విధించామని తెలిపింది. సుమారు రూ. 7080 కోట్లు ఫెమా చట్టం కింద స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

ed