పోలవరం.. ఈ ఒక్క ప్రాజెక్టు చాలు.. ఆంధ్రప్రదేశ్‌ మొత్తం సస్యశ్యామలం అవుతుందంటారు. గోదావరి నది ద్వారా ఏటా వందల టీఎంసీల విలువైన జలాలు సముద్రం పాలవుతున్నాయి.వాటిలో కనీసం ఏటా 300 టీఎంసీలు నిల్వ చేసుకుంటే చాలు ఏపీ మొత్తం సస్యశ్యామలం అవుతుంది. ఆ ఉద్దేశ్యంతోనే పోలవరం ప్రాజెక్టును డిజైన్ చేశారు. ఈ డిజైనింగ్ ఎప్పుడో దశాబ్దాల క్రితమే అయినా.. ప్రాజెక్టు పనులు మాత్రం నత్త నడకనే సాగుతున్నాయి.


ఏపీ విభజన సమయంలో విభజనకు నష్టపరిహారంగా పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి కేంద్రమే కట్టిస్తామని చెప్పింది. కానీ.. చంద్రబాబు సర్కారు డబ్బులు మీరు ఇవ్వండి..మేం కట్టుకుంటామని కేంద్రం నుంచి నిర్మాణ బాధ్యతలు తీసుకుంది. జగన్ సర్కారు వచ్చాక.. కాంట్రాక్టరు మార్పు... అంటూ ఇంకాస్త ఆలస్యం అయింది. దీనికి తోడు కేంద్రం కూడా సకాలంలో నిధులు ఇవ్వట్లేదు. ఇప్పుడు మాత్రం మూడు పార్టీలు పోలవరం ఆలస్యానికి మీరంటే మీరే అని విమర్శలు చేసుకుంటున్నాయి.


తాజాగా.. టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ఆలస్యం జరుగుతుందని బీజేపీఎమ్మెల్సీ మాధవ్ విమర్శించారు. కొత్త నినాదాలు, కొత్త వివాదాలకు ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు కేంద్రంగా మారిందంటున్నారాయన. పోలవరం ముంపు గ్రామాల ప్రజలు పక్క రాష్ట్రానికి‌ వెళ్లిపోతాం అంటున్నారని విమర్శించారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి చేస్తున్న రోజుకొక ప్రకటన గందరగోళం కలిగిస్తుందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై 15 రోజులకు ఒకసారి కేంద్ర మంత్రి సమీక్ష చేస్తున్నారని మాధవ్ వివరించారు.


పోలవరం నిర్మాణానికి ఎక్కడ నిధులు ఆగాయో ... కేంద్రం నుంచి ఏ సహకారం రాలేదో చెప్పాలని ప్రభుత్వాన్ని మాధవ్ డిమాండ్ చేశారు. మూడేళ్లుగా ఆర్ ఆర్ ప్యాకేజీ పై వైకాపా ప్రభుత్వానికి స్పష్టత లేదని మాధవ్ విమర్శించారు. రీయంబర్స్ మెంట్ సిస్టం  వచ్చిన తర్వాత నిధులు ఎక్కడైనా అగాయా అని ప్రభుత్వాన్ని మాధవ్ అడిగారు. రాష్ట్ర ప్రభుత్వం తమ తప్పులను కేంద్రంపై నెట్టడం సరికాదని మాధవ్ హితవు పలికారు. మరి అందరూ వీరులే.. ఎందుకు పోలవరం ఆలస్యమవుతోంది.. సమాధానం చెప్పేదెవరు?

మరింత సమాచారం తెలుసుకోండి: