గతంలో ఎన్నికల సమయంలో కేసీఆర్ అనేక హామీలు ఇచ్చారు. వాటిలో అమలు కాని వాటిని ప్రశ్నిస్తూ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ లేఖలు రాస్తున్నారు. తాజాగా మూసీ పరివాహక ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. ఆగస్ట్‌ 5న ప్రజా సంగ్రామ యాత్ర నాలుగో రోజు యాదాద్రి భువనగిరి జిల్లా పెద్దరావులపల్లి నుంచి వెళ్తుండగా మూసీ పరివాహక ప్రాంతంలోని ప్రజలతో మాట్లాడి, వారి కష్టాలను స్వయంగా చూసి తీవ్ర ఆవేదన చెందానని బండి సంజయ్ తెలిపారు.


మూసీ నీటితో స్థానిక ప్రజలు పడుతున్న కష్టాలు కన్నీరు పెట్టించాయని.. మూసీ వల్ల ఇక్కడి ప్రజలు తినే తిండి కూడా కలుషితమైపోయింది. మూసీ నీళ్లతో పంటలన్నీ నాశనమవుతున్నాయి. పెళ్లి చేసుకుందామంటే ఇక్కడి వారికి పిల్లను కూడా ఇవ్వడం లేదని బండి సంజయ్ తెలిపారు. 40 ఏళ్ల క్రితం రూపాయి బిళ్ల వేస్తే కనిపించేంత స్వచ్ఛంగా ఉండే మూసీ నీళ్లు ఇప్పుడు మురికికి మారుపేరుగా మారాయని.. కలుషితాల వల్ల ఇక్కడ పండిన పంటను స్థానికులెవరు తినట్లేదు. అన్నం వండితే 4, 5 గంటల్లో పాచిపోతుందని బండి సంజయ్ లేఖలో తెలిపారు.


మూసీ నదిని రూ.4 వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రక్షాళన చేస్తానన్న మీ హామీ అమలు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని బండి సంజయ్ గుర్తు చేశారు. గుజరాత్‌లోని సబర్మతి మాదిరిగా మూసీని సుందరీకరిస్తామన్నా ఆ దిశగా ఇప్పటివరకూ మీరు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.  
పరిశ్రమల వ్యర్థాలను మూసీలో కలుపుతున్నా చర్యలు శూన్యమని.. ఇప్పటికైనా  ఈ ప్రాంత ప్రజలు కష్టాలను అర్థం చేసుకొని, వీరి సమస్యలకు పరిష్కారం దిశగా సానుకూల చర్యలు తీసుకోవాలని కోరుతున్నానని బండి సంజయ్  తెలిపారు.


మూసీ రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టుకు రూ.4000 కోట్లు కేటాయించి, తక్షణమే విడుదల చేసి, ఎలాంటి అవినీతికి అస్కారం లేకుండా ఆ నిధులను సక్రమంగా వినియోగించాలని బండి సంజయ్  డిమాండ్ చేశారు. మూసీ కలుషిత జలాల వల్ల అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఇక్కడి ప్రజలకు తగిన వైద్య సహాయం అందించాలని బండి సంజయ్ తన లేఖలో కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: