ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెయిల్ వచ్చింది. ఆయనపై నమోదైన పీడీ యాక్టు కేసును హైకోర్టు రద్దు చేసింది. కొన్ని షరతులు విధిస్తూ హైకోర్టు ఈ తీర్పునిచ్చినట్లు రాజాసింగ్ లాయర్ పేర్కొన్నారు.  జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత ఎలాంటి విద్వేషపూరిత ప్రసంగాలు చేయొద్దని, మూడు నెలల వరకు సామాజిక మాధ్యమాల్లో ఎలాంటి వీడియోలు అప్ లోడ్ చేయొద్దని అభిషేక్ రెడ్డి, శ్రీదేవీలతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పునిచ్చినట్లు రాజాసింగ్ లాయర్ తెలిపారు. ఈ షరతులు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది.


అంతే కాదు.. విడుదలైన తర్వాత ఎలాంటి ర్యాలీలు నిర్వహించొద్దని హైకోర్టు ఆదేశించింది. హైదరాబాద్ పోలీసులు, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై ఈ ఏడాది ఆగస్టు 25న పీడీ చట్టం కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. విద్వేష పూరిత ప్రసంగాలు రెచ్చగొడుతున్నారంటూ అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకు రిమాండ్ కు తరలించారు. రాజాసింగ్ ను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆయన భార్య ఉషాభాయి హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ ప్రయోజనాల కోసం రాజాసింగ్ పై పీడీ చట్టం నమోదు చేశారంటూ పిటీషనర్ తరఫు న్యాయవాది హైకోర్టులో వాదించారు.


దీనిపై తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. పీడీ చట్టం నమోదు చేయడంపై సుదీర్ఘ వాదోపవాదాలు కూడా జరిగాయి. గతంలో పలువురిపై నమోదు చేసిన పీడీ చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసిన కేసులను రాజాసింగ్ తరఫు న్యాయవాది హైకోర్టులో వాదించారు. రాజాసింగ్ ఏ మతాన్ని కించపర్చే విధంగా వ్యాఖ్యలు చేయలేదని ఆయన తరఫు న్యాయవాది రవిచందర్ వాదించారు. రాజాసింగ్ పై ఇప్పటి వరకు 101 కేసులు నమోదయ్యాయని తెలిపారు.


ప్రభుత్వం కూడా గట్టిగానే వాదించింది. ఈ ఏడాది ఆర్నెళ్ల వ్యవధిలోనే మూడు పీఎస్ ల పరిధిలో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యానించాడని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ హైకోర్టుకు తెలిపారు.  రాజాసింగ్ వల్ల సమాజంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నట్లు వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు రాజాసింగ్ కు అనుకూలంగా తీర్పునిచ్చింది. అయితే.. షరతుల కారణంగా రాజాసింగ్ గతంలోలా రెచ్చిపోయే అవకాశం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: