తెలంగాణలో కొత్త పొత్తులు పొడుస్తున్నాయి. నిన్నటి వరకు ఎవరితో పొత్తులు ఉండవు అని ప్రకటించిన పార్టీలు తాజాగా వాటి కోసం వెంపర్లాడుతున్నాయి. కాంగ్రెస్ సింగిల్ గానే పోటీకి వస్తుందని ప్రకటించి ప్రస్తుతం సీపీఎం, సీపీఐతో పొత్తుల కోసం చర్చలు జరుపుతూ ఉంది. మరోవైపు తెలంగాణ జన సమితితో కూడా చర్చలు కొనసాగిస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక వరకు బలంగా ఉన్న బీజేపీ మాకు ఎవరితో పొత్తు ఉండదని సింగిల్ గానే 119 స్థానాల్లో పోటీ చేస్తామని ఆ పార్టీ నేతలు ప్రకటించారు.


జనసేన కూడా తెలంగాణలో 30 స్థానాల్లో పోటీ చేస్తుందని ప్రకటించిన నేపథ్యంలో ఇటీవల టీస్‌ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ లు నేరుగా పవన్ కార్యాలయానికి వచ్చి జనసేన అధినేతను కలవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇప్పటికే జనసేన ఎన్డీయే భాగస్వామిగా ఉంది. తెలంగాణలో కలిసి పోటీ చేయడంపై వారి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. జనసేన ఆవిర్భావం నుంచి తాము వ్యవహరించిన తీరు పవన్ ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు సమాచారం.


2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీ, టీడీపీకి మద్దతు ఇచ్చి వారి గెలుపు కోసం కృషి చేసినట్లు వివరించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ అధిష్ఠానం సూచన మేరకు పోటీ విరమించుకున్న వైనాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు కనీసం 30 స్థానాల్లో పోటీ చేయకపోతే కార్యకర్తల ధైర్యం కోల్పోయే అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలిపినట్లు సమాచారం.


హైదరాబాద్ లో బీజేపీ బలంగా ఉంది అని చెప్పడానికి నిదర్శనం కార్పొరేషన్ ఎన్నికలు. వీటికి అదనంగా బలం చేకూర్చేందుకు జనసేనను తమతో కలిసిరావాలని వీరు కోరారు.  పొత్తుతో ముందుకు సాగుదామంటే ఓకే కానీ మద్దతు విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని వారు సూచించారు. ఉమ్మడిగా పోటీ చేసే అంశం పై రెండురోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: