
అయితే శిరీష డిగ్రీ అగ్రికల్చర్ చదివి.. ఉద్యోగం కోసం ప్రయత్నించి.. ఉద్యోగం లేక బర్రెలను కాసుకుంటున్నట్లు ఆమె ఒక వీడియోలో తెలిపింది. ఆ వీడియోతో ఆమె ఫేమస్ అయింది. ప్రస్తుతం ఆమె ఎన్నికల బరిలో నిలవడంతో కొన్ని దాడులు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆమెకు భద్రత కల్పించవల్సిందిగా ఆదేశించింది. అయితే పౌర సమాజం నుంచి ఆమెకు ఊహించని మద్దతు లభిస్తోంది. జేడీ లక్ష్మీ నారాయణ, కంచె అయిలయ్య లు సైతం ఆమె తరఫున ప్రచారం చేశారు.
ప్రస్తుతం రాజకీయాలు డబ్బుమయం అయ్యాయి. అంగబలం, ఆర్థిక బలం లేకుంటే రాజకీయాల్లోకి రావడమే కష్టం. అలాంటి పరిస్థితుల్లో ఓ సాధారణ అమ్మాయి ప్రధాన పార్టీలతో తలపడతా అంటూ ముందుకు వచ్చింది. ఇలాంటి సందర్భంలో పౌర సమాజం ఈమెకే కాదు మరెవరైనా ఈ పని చేస్తే కచ్చితంగా అండగా నిలబడుతుంది. ఓట్లు వస్తాయా, గెలుస్తుందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే.
అయితే బర్రెలక్క పోటీ వల్ల నిరుద్యోగం అనే అంశం బలంగా వినిపిస్తోంది. తెరపైకి వచ్చింది కూడా. కర్ణాటకలో ఒక ఉదాహరణను పరిశీలిస్తే సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్లు బీజేపీ ఓటమికి కీలక పాత్ర పోషించాయి. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి క్యాంపెయిన్లు నిర్వహించి బీజేపీ వ్యతిరేక విధానాలపై పోరాటం చేశాయి. కర్ణాటకతో పోల్చితే తెలంగాణలో నిరుద్యోగం అంశంపై పోరాటం చాలా తక్కువ. సమాజంలో ఉన్న సమస్యను వెలుగులోకి తీసుకువచ్చిన బర్రెలక్క కు తెలంగాణ పౌరుల మద్దతు లభిస్తోంది. ఇది అంతటా ఉంటుందా అంటే చెప్పలేం. ప్రభుత్వం మారితే ఈ అంశం మరుగున పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.