ఏపీ రాజకీయాలు అంటే.. కులం ప్రధానంగా సాగుతాయనే విమర్శ ఉంది. ఇది అనేక సార్లు రుజువు అవుతోంది కూడా. పార్టీలు అభ్యర్థుల జాబితాలు ప్రకటించే సమయంలోనే ప్రత్యేకంగా తాము ఏ సామాజిక వర్గానికి ఎన్ని సీట్లు ఇచ్చామో కూడా చెబుతుంటాయి. అంతే కాదు.. జాబితాలు ఇచ్చేటప్పుడు అభ్యర్థి కులాన్ని కూడా ప్రత్యేకంగా ప్రస్తావిస్తుంటారు. అంతటి ప్రాధాన్యం ఉంటుంది కులానికి.


అందుకే పార్టీలు అభ్యర్థుల ఎంపికలో కులాన్ని ప్రధానంగా పరిశీలిస్తాయి. అయితే.. ఇప్పుడు ఏపీలో కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. కులాంతర వివాహం చేసుకున్న నేతలను ప్రత్యేకంగా పరిశీలిస్తున్నాయి. ఎందుకంటే.. కులాంతర వివాహం చేసుకున్న నేతలైతే.. వారి ఇద్దరి కులాల నేతలనూ సంతృప్తి పరచవచ్చన్న భావన కనిపిస్తోంది.


పెనుకొండ ఒకటిలో ఈసారి వైసీపీ, కూటమి ఇద్దరూ మహిళా అభ్యర్థులనే బరిలో నిలిపారు. వైసీపీ మంత్రి, కురుబ సామాజిక వర్గానికి చెందిన ఉషాశ్రీ చరణ్‌ను ఇక్కడి నుంచి బరిలో ఉన్నారు. ఇక టీడీపీ కూటమి కూడా కురబ సామాజిక వర్గానికే చెందిన సవితమ్మ పోటీలో దింపారు. ఈ ప్రాంతంలో కురుబల జనాభా ఎక్కువగా ఉండటంతో ఉషా శ్రీ చరణ్‌ను బరిలో వైసీపీ దింపింది. ఆమె భర్త రెడ్డి కులానికి చెందిన వారు కావడం కూడా మరో కారణం.


రాయలసీమలో రెడ్డి వర్గానికి ఉన్న ప్రాధాన్యం తెలిసిందే. అందుకే అటు కురుబలు, ఇటు రెడ్లు కూడా ఉషాశ్రీ గెలుపుకు సహకరిస్తారని వైసీపీ భావిస్తోంది. అయితే టీడీపీ నుంచి బరిలో ఉన్న సవితమ్మ కూడా కురుబ మహిళే. అంతే కాదు.. సవితమ్మ భర్త కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు. ఇది కూడా ఇక్కడ ఆమెకు కలసివస్తోందని టీడీపీ భావిస్తోంది. ఈ ప్రాతంలో జనాభాలో ఎక్కువగా ఉన్న కురుబలకు తోడు రాజకీయ ఆధిపత్యం ఉన్న కమ్మలతో పాటు బీసీ సామాజికవర్గ ఓట్లపై సవితమ్మ ఆశలు పెట్టుకున్నారు. కురుబ, రెడ్లు, ఎస్సీ, ఎస్టీ ఓటు బ్యాంకు తనకు కలసివస్తుందని ఉషాశ్రీ చరణ్‌ భావిస్తున్నారు. కానీ నాన్‌లోకల్ కావడం.. ఎమ్మెల్యే, మంత్రిగా మంచి పేరు తెచ్చుకోకపోవడం ఉషాశ్రీకి మైనస్‌గా ఉన్నాయి. మరి పెనుకొండ వాసులు ఎవరికి పట్టం కడతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: