గత నాలుగు రోజులుగా మంచు కుటుంబంలోని వ్యవహారం రచ్చకెక్కిన సంగతి తెలిసిందే.  ఎన్నో బ్రేకింగ్ న్యూస్ లు, మరెన్నో గాసిప్పులు, ఇంకెన్నో ఫిర్యాదులు, చాలా ఉద్రిక్తతలు!  ఇలా సుమారు నాలుగు రోజులుగా మోహన్ బాబు ఇంటి వ్యవహారం మీడియాలోనూ, ఇండస్ట్రీలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


"అందరికీ నమస్కారం" అంటూ మోహన్ బాబు గంభీరమైన వాయిస్ తో ఓ ఆడియో విడుదలైంది! అభిమానులకు.. శ్రేయోభిలాషులకు.. ఆత్మీయులకు.. ప్రజా ప్రతినిధులకు.. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు.. మీడియా ప్రతినిధులకు.. నా హృదయపూర్వక నమస్కారాలు"! "గత నాలుగు రోజులుగా ఏవేవి జరుగుతున్నదనేది అందరికీ తెలుసు. నా ఆవేదన ఏమిటంటే... కుటుంబ సమస్యల్లో పర్మిషన్ లేకుండా ఎవరైనా జోక్యం చేసుకోవచ్చా..? మీరే ఆలోచించాలి! "


"పత్రికా సోదరులు నాలుగు రోజుల నుంచి నా ఇంటి ముందు మనుషులను పెట్టుకుని, వ్యాన్ లు పెట్టుకుని, అలా ఉండటం ఎంతవరకూ న్యాయం?..  అప్పటికీ బయటకు పోతున్నప్పుడు చెప్పాను.. అందరికీ నమస్కారమయ్యా.. ఇది నా కుటుంబ వ్యవహారం, మీకూ కుటుంబాలు ఉన్నాయి, దయచేసి నన్ను గౌరవించండని!" ముఖ్యంగా తెలుసుకోవాల్సింది.. రాత్రుళ్లు గేటు తోసుకుని, గేటు పగలగొట్టి, పర్మిషన్ లేకుండా ఎవరైనా రావొచ్చా..?


"వచ్చిన వాళ్లు అందరూ మీడియా సోదరులా.. లేక, ఇంకెవరైనా నా మీద రాగద్వేషాలతో ఏదో ఒక ఛానల్ చేతిలో పెట్టుకుని అలా వచ్చి ఉంటారేమోనని సందేహం. అంతే తప్ప జర్నలిస్టులను కొట్టాలని తాను మనసావాచా దైవసాక్షిగా అలా ఆలోచించేవాడిని కాదు. నేను అతడిని కొట్టామనే చెబుతున్నారు తప్ప.. మైకు నోట్లో పెట్టారు.. నా కన్ను పోవాల్సింది.. నా కన్ను పోయి ఉంటే అప్పుడు నేను కేసులు పెట్టాలి.. కన్ను పోలేదు, కొంచెం తగిలింది కంటి కింద.. నేనే ఎస్కేప్ అయ్యాను.. లేకపోతే నా జీవితం గుడ్డిది అయ్యేది!"


"మైకు లాక్కోవడం, కేకలెయ్యడం, నేను కొట్టిన దెబ్బ అతడికి తగిలి ఉండొచ్చు.. తగిలిందన్నారు.. అందుకు హృదయపూర్వకంగా బాధ పడుతున్నాను.. అతడూ నాకు తమ్ముడే.. ఈ రోజుకీ నేను బాధపడుతున్నాను. "నేను కొట్టినది తప్పు.. ఏ సందర్భంలో కొట్టాల్సి వచ్చింది..? మీ ఇంట్లోకి దూరితే ఒప్పుకుంటారా.. మీ ఏకాగ్రతకు భంగం కలిగిస్తే ఒప్పుకుంటారా.. మీరే ఆలోచించండి! మీడియా ప్రతినిధుల ఇల్లల్లోకి వారు రాసిన విషయాలపై పది మంది వెళ్లి నిలదీస్తే.. దండం పెట్టి పంపిస్తారా..? మీకు టీవీలు ఉన్నాయి.. మాకు టీవీలు లేవు!"


మళ్లీ మళ్లీ చెబుతున్నా.. అసలు అతను నిజంగా జర్నలిస్టా.. కాదా.. అని ఆ చీకట్లో ఎలా తెలుస్తుంది..? టీవీ9 అని నాకు ఎలా తెలుస్తుంది..? ఆ టైం లో కంటి మీదకు మైకు వచ్చింది.. దాన్ని లాక్కున్నాను. కానీ ఇక్కడ మాత్రం ఏకపక్ష నిర్ణయం.. ఏమి చేస్తున్నారో ప్రజలారా మీరే ఆలోచించండి.. నేను చేసింది న్యాయమా అన్యాయమా.. మీరే ఆలోచించండి. నా ఇంటి గేటు బద్దలుకొట్టి రావడం న్యాయమా.. మీరే చెప్పండి. ఎల్లప్పుడూ మీ ఆశీస్సులు కోరుకునే మీ మోహన్ బాబు.. నమస్కారం"!


మరింత సమాచారం తెలుసుకోండి: