రాష్ట్రంలోని మహిళలను వృద్ధిలోకి తెచ్చేందుకు రేవంత్ సర్కారు కృషి చేస్తోంది. ఇందులో భాగంగా మహిళలకు ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తోంది. దీంతో పాటు గృహజ్యోతి, రూ.500లకే గ్యాస్ సిలిండర్, ఇందిరా శక్తి క్యాంటీన్ తదితర పథకాలను మహిళల కోసం అమలు చేస్తోంది. ఇప్పుడు తాజాగా మహిళా దినోత్సవం పురస్కరించుకొని మరో శుభవార్త చెప్పింది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇప్పటికే మహిళలకు ఉపాధి కల్పించడానికి పలు నిర్ణయాలను తీసుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం రైల్వే స్టేషన్ లో మహిళా సంఘాల ఉత్పత్తులకు స్టాల్స్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీంతో పాటు మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులను కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. మొదటి విడతలో 150 మండల సమాఖ్యలకు 150 ఆర్టీసీ అద్దె బస్సులను ఇవ్వనుంది. ఆ తరువాత మిగిలిన మండల సమాఖ్యలకు కూడా 450 ఆర్టీసీ అద్దె బస్సులను కేటాయిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. దీనికోసం ప్రతి నెల ఒక్కొక్క ఆర్టీసీ అద్దె బస్సు కు అద్దె రూపంలో 77,220 రూపాయలను చెల్లించనుంది తెలంగాణ ఆర్టీసీ. ఇక బస్సుల కొనుగోలు కోసం మహిళా సంఘాలకు బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
దేశంలోనే తొలిసారిగా మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీ అద్దె బస్సులను నిర్వహించాలనే సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం పైన తెలంగాణ వ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మార్చి 8న హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో ఇందులో భాగంగా 50 బస్సులను లాంఛనంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తో పాటు మంత్రులు ప్రారంభించనున్నారు.
మొదటి దశలో ప్రయోగాత్మకంగా రెండు జిల్లాలలో మహిళ సంఘాలకు ఆర్టీసీ బస్సులను కేటాయిస్తారు. మహబూబ్ నగర్, కరీంనగర్ లలో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. మహిళా సంఘాల ద్వారా కొనుగోలు చేసే ఈ 150 బస్సులను నిర్వహణ బాధ్యతల కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి పర్యవేక్షించనున్నారు.
బస్సుల కొనుగోలు ఖర్చు, వచ్చే ఆదాయం, నిర్వహణ ఖర్చు మొదలైన అంశాల పైన సమగ్ర నివేదికను రూపొందించింది. రాష్ట్రవ్యాప్తంగా బస్సుల సంఖ్య పెంచాలని డిమాండ్ నేపథ్యంలో ఇందులో భాగంగా మహిళా సంఘాలకు ఉపాధి కల్పించాలని, వారు కొనుగోలు చేసే బస్సులను అద్దెకు తీసుకోవాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి