విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకుంటే మన దగ్గర ఉన్న పది, ఇంటర్ ధ్రువీకరణ పత్రాలు వారికి అవసరం లేదు. డిగ్రీలు, పీజీల్లో విశ్వ విద్యాలయాల్లో సహకారాలు అన్నీ తనిఖీ చేస్తుంటారు. క్షేత్ర స్థాయిలో ఇతర దేశాలతో కూడిన చదువులు అయితే త్వరగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఈ ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంచలనాత్మక విద్యా సంస్కరణ చేపట్టింది.


ప్రభుత్వ బడుల్లో చదివే బడుగు, బలహీన వర్గాల పిల్లలను అంతర్జాతీయ స్థాయిలో ఉన్నతంగా తీర్చి దిద్దేందుకు కొత్త సంస్కరణకు శ్రీకారం చుట్టింది. ఇంటర్నేషనల్ బక్లాలిరియట్(ఐబీ) సిలబస్‌ను ప్రభుత్వ బడుల్లో ప్రవేశపెట్టనున్నారు. ఇటీవల జరిగిన మంత్రి మండలి సమావేశంలో చర్చించి దీనికి ఆమోదం తెలిపారు. దీంతో పాటు ఐబీ సంస్థతో ఒప్పందం కూడా చేసుకున్నారు. సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో ఐబీ చీఫ్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ మార్క్ కాస్టల్లో విద్యాశాఖ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ సంతకాలు చేశారు. ఐబీ డైరక్టర్ జనరల్ ఒల్లీ పెక్కా హీనోన్ తో పాటు సింగపుర్, వాషింగ్టన్ డీసీ, జెనీవా యూకే నుంచి ఆ సంస్థ అంతర్జాతీయ ప్రతినిధులు దూర దృశ్య శ్రవణ సమీక్షలో పాల్గొన్నారు.


సీఎం జగన్ మాట్లాడుతూ.. ఏపీలోని ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులను ప్రపంచంలో అత్యుత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని అందుకే ఐబీ సహకారాన్ని కోరుతున్నట్లు తెలిపారు.  ఇక్కడి విద్యార్థులు సంపాదించే ధ్రువపత్రాలు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా చెల్లుబాటు అవ్వాలన్నదే తమ ఉద్దేశమని వివరించారు. అంతర్జాతీయ చదువులను అట్టడుగు వర్గాల వారికి అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.


ఐబీ సిలబస్ అందించడం సవాలుతో కూడుకున్నదే అయినా సంకల్పంతో ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతులు కల్పించి తరగతి గదులను డిజిటైలేజేషన్ చేసి.. ఎనిమిదో తరగతి విద్యార్థులందరికీ ట్యాబ్ లు  ఇచ్చాం.. అమ్మ ఒడి, ప్రతిరోజు పిల్లలకు టోఫెల్ శిక్షణ.. ఆంగ్ల మాధ్యమంలో బోధన వంటి కార్యక్రమాలు చేపట్టామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: