పిల్లల చదువుల విషయంలో పూర్వం తల్లిదండ్రుల పాత్ర తక్కువగానూ, ఉపాధ్యాయుల పాత్ర ఎక్కువగానూ ఉండేది. కానీ ఇంతకుముందుకు, ఇప్పటికీ పిల్లల చదువుల్లో ఎంతో మార్పు వచ్చింది. అందువలన తల్లిదండ్రులకు, పిల్లల చిన్న వయస్సునుండే ఎక్కువ బాధ్యత తీసుకోవలసిన అవసరం ఏర్పడింది. పిల్లల చదువు విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, కొంచం శ్రద్ధ వహించాలి. పిల్లల చదువు విషయంలో తల్లిదండ్రులు తగిన శ్రద్ధ వహించి, వారిచేత చదివించటం, హోంవర్కు చేయించటం చేయాలి. అంతేకాని దగ్గరుండి ప్రతీదీ మీరే చేయకూడదు. దానివలన పిల్లలకు లాభంకంటే నష్టం ఎక్కువ.

 

పిల్లలు ఏకాగ్రతగా చదువుకోవటానికి ఇంటివాతావరణం దోహదం చేసేట్లుగా చూడాలి. కొంతమంది పిల్లలు కొన్ని పాఠ్యాంశాలు చదవటానికి కష్టపడుతుంటారు. వారికి తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించి, తగిన శిక్షణ ఇవ్వాలి. అంతేకాని వారిని కించపరిచి, హేళన చేయకూడదు. అలా చేస్తే వారు నూన్యతాభావానికి గురవుతారు. చిన్నప్పటినుంచి పిల్లలకు పాఠ్యాంశాలే కాక, లోక జ్ఞానాన్ని ఇచ్చే పుస్తకాలను చదివే అలవాటు చేయాలి, వివిధ ప్రదేశాలకు తీసుకువెళ్ళాలి.
పిల్లల పాఠశాలలకు వెళ్ళి, వారి ఉపాధ్యాయులను కలిసి, వారి అభిప్రాయాలను తెలుసుకుని చర్చించాలి. పిల్లలు ఏదైనా ఒక విషయంలో విశేషమైన ప్రతిభ కనబరిచినపుడు వారిని తల్లిదండ్రులు గుర్తించి ప్రోత్సహించాలి. అప్పుడు వారికి శక్తి సామర్థ్యాలు, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి.


పిల్లల చదువుల విషయంలో తల్లిదండ్రులు లింగబేధాలను, పక్షపాత వైఖరిని చూపకూడదు, అమ్మాయిలను అబ్బాయిలతో సమానంగా చదివించాలి. తల్లిదండ్రులు పిల్లల చదువుల విషయంలో వారి శక్తి సామర్థ్యాలను మించిన ఫలితాలను ఆశించకూడదు. చదువుతోపాటు పిల్లలకు ఆటలు, వ్యాయామం కూడా అవసరమే. ఆటల వలన పిల్లల దేహాభివృద్ధి, మానసికాభివృద్ధి పెంపొందుతాయి.


మన చేతివేళ్ళన్నీ ఒకలాగే ఉండనట్లే, మన పిల్లలంతా ఒకలాగే ఉండరు, అయినా తల్లిదండ్రులు సమానంగా చూస్తూ చదివించినట్లయితే పిల్లలు చక్కగా చదివి, మంచి పేరు తెచ్చుకుంటారు. " నేటి బాలలే రేపటి పౌరులు " అన్న విషయం అందరికీ తెలిసిందే. కనుక చిన్నతనంలో పిల్లలకు ఇచ్చే శిక్షణపైనే వారి భావి జీవితం ఆధారపడి ఉంటుందన్న విషయం తల్లిదండ్రులు గ్రహించాలి. పిల్లల పెంపక విషయంలో ఈ సూచనలన్నీ పాటిస్తే వాళ్ళు చాలా చక్కగా పెరుగుతారు అలాగే పిల్లలు వాళ్ళ యొక్క భవిష్యత్తును అందంగా మార్చుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: