ఈ మెట్రో నియో ప్రాజెక్టును పీపీపీ పద్దతిలో రూపొందిస్తారు. మెట్రో నియో అంటే.. ఈబీఆర్‌టీఎస్- ఎలివేటెడ్ బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ అన్నమాట.. అంటే మెట్రో తరహాలోనే ఉంటుంది. కానీ.. రైల్ కోచ్‌లకు బదులుగా ఎలక్ట్రిక్ బస్ కోచ్‌లు ఉంటాయన్నమాట. ఈ ప్రాజెక్టుకు రూ.2500 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ సరికొత్త ప్రాజెక్టును హెచ్‌ఎండీఏ.. హైబ్రీడ్ యాన్యుటీ మోడల్ పద్ధతిలో చేపట్టనుంది. దీనికి హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో తోడ్పాటు అందిస్తుంది. టీఎస్‌ఐఐసీ కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం అవుతుంది.
ఈ మెట్రో నియోకు సంబంధించిన వివరాలు చూస్తే.. ఇది కూడా అచ్చం మెట్రో మాదిరే ఉంటుందని చెబుతున్నారు. దీనికి కూడా ఎలివేటెడ్ కారిడార్ ఏర్పాటు చేస్తారు. అందులో మెట్రో కోచ్‌ల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు ఉంటాయి. మెట్రో తరహాలోనే ఈ ఎలక్ట్రిక్ బస్సులను కూడా అత్యాధునిక హంగులతో రూపొందిస్తారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన సమగ్ర నివేదిక సిద్ధమైంది. హెచ్‌ఎండీఏ అధికారులు రూపొందించిన ఈ నివేదను ప్రభుత్వం పరిశీలిస్తోంది.
ఇది కూడా సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి వస్తే.. కూకట్ పల్లి - కోకా పేట మధ్య రాకపోకలు మరింత సులువు అవుతాయి. ఆ ట్రయాంగిల్ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందుతుంది. ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్, మెట్రో సేవలతో హైదరాబాద్ రూపు రేఖలు చాలా వరకూ మారిపోయాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి