- ( గ్రేట‌ర్ హైద‌రాబాద్ - ఇండియా హెరాల్డ్ ) . . .

గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో నార్సింగి, నానక్ రామ్ గూడ ప్రాంతాలు ఒక దశాబ్దం క్రితం హైదరాబాద్ పరిసరాల్లో ప్రశాంత వాతావరణం, ట్రాఫిక్ రహిత జీవనం కోరుకున్న మధ్యతరగతి కుటుంబాలకు ప్రధాన చిరునామాగా నిలిచాయి. అప్పట్లో ఇళ్ల కొనుగోళ్ల సమయంలో “ ఇక్కడ ట్రాఫిక్ సమస్య ఎప్పటికీ ఉండదు ” అనే నమ్మకం ప్రజల్లో బలంగా నిలిచింది. అయితే పరిస్థితులు వేగంగా మారాయి. రోజురోజుకు పెరుగుతున్న నివాస సముదాయాలు, ఐటీ రంగం విస్తరణ, వ్యాపార అవసరాలు పెరగడంతో ఈ ప్రాంతాలు ఇప్పుడు ట్రాఫిక్ పద్మవ్యూహంగా మారిపోయాయి.
ఇప్పుడు కోకాపేట వైపు రియల్టీ మార్కెట్ జెట్ స్పీడ్ రాకెట్ వేగంతో ఎదుగుతోంది. నో ఫ్లోర్ ఇండెక్స్  విధానం అమల్లోకి రావడంతో, డెవలపర్లు ఎన్ని అంతస్తులు కావాలంటే అంతే నిర్మించుకునే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న స్కైటవర్స్‌లో ఎక్కువగా కనీసం 50 అంతస్తులే ఉండటం గమనార్హం. ప్రతి ఇంటికి రెండు నుంచి మూడు కార్లు ఉండటం ఈ ప్రాంతాలపై రాబోయే రవాణా ఒత్తిడిని ముందే అంచనా వేయిస్తుంది.


ఇప్పటికే నార్సింగి - ఎన్‌ఆర్‌జీ - కోకాపేట రోడ్లపై ఉదయం, సాయంత్రం పీక్ అవర్స్‌లో వాహనాలు నత్తనడకన కదులుతున్నాయి. కొంతమంది నివాస సముదాయాలు పూర్తికి చేరుకున్నాయి, మరికొన్ని ప్రారంభ దశలో ఉన్నాయి. రాబోయే నాలుగు నుంచి అయిదేళ్లలో అన్ని ప్రాజెక్టులు పూర్తయి ఆక్యుపై అయినప్పుడు పరిస్థితి ఎంత కఠినంగా మారుతుందో ఊహించడం కష్టమే. చాలా తక్కువ భౌగోళిక పరిమితిలో లక్షల మంది నివసించే అవకాశం ఉండగా, రోడ్లపై వేల కాదు ...  లక్షల వాహనాలు పరుగెత్తే అవకాశం ఉంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్ విషయంలో ముందస్తు అంచనా ఉండకపోవడం ప్రభుత్వాల సర్వసాధారణ పద్ధతిగా మారింది. సమస్య తీవ్రంగా పెరిగిన తర్వాతే చర్యలు ప్రారంభమవుతాయి. అదే ఒరవడిలో మార్పు రాకపోతే, కోకాపేట భవిష్యత్తులో అత్యంత రద్దీ, ఉద్విగ్నమైన ట్రాఫిక్ జోన్‌గా మారడం అనివార్యం అన్నది నిపుణుల అభిప్రాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: