పచ్చని పసిడి ఛాయతో, కమ్మని వాసనతో ఉండే నెయ్యి భారతీయ వంటకాల్లో అమృతం లాంటిది. అయితే, నేడు మార్కెట్లో లభించే నెయ్యిలో కల్తీ పెరిగిపోవడం ఆందోళన కలిగించే విషయం. లాభాపేక్షతో కొందరు వ్యాపారులు నెయ్యిలో వనస్పతి, పామాయిల్, జంతువుల కొవ్వు, చివరకు బంగాళాదుంప గుజ్జును కూడా కలిపేస్తున్నారు. ఇలాంటి కల్తీ నెయ్యిని వాడటం వల్ల గుండె సంబంధిత వ్యాపారులు, అధిక కొలెస్ట్రాల్ వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే మనం కొనే నెయ్యి అసలైనదో కాదో ఇంట్లోనే కొన్ని సులభమైన పద్ధతుల ద్వారా పరీక్షించుకోవచ్చు.

అన్నింటికంటే సులభమైన మార్గం అరచేతి పరీక్ష. కొద్దిగా నెయ్యిని తీసుకుని మీ అరచేతిలో వేయండి. అది అసలైన నెయ్యి అయితే మీ శరీర వేడికే వెంటనే కరిగిపోతుంది. ఒకవేళ అది కరగడానికి సమయం తీసుకున్నా లేదా గడ్డకట్టినట్లు ఉన్నా అందులో కల్తీ జరిగినట్లు అర్థం చేసుకోవాలి. అలాగే నెయ్యి రంగును బట్టి కూడా నాణ్యతను అంచనా వేయవచ్చు. సాధారణంగా ఆవు నెయ్యి పసుపు రంగులో, గేదె నెయ్యి తెల్లగా ఉంటుంది. కానీ నెయ్యిని మరిగించినప్పుడు అది వెంటనే ముదురు గోధుమ రంగులోకి మారి ప్రత్యేకమైన సువాసన వస్తే అది స్వచ్ఛమైనది. అలా కాకుండా మరిగించినప్పుడు రంగు మారడానికి సమయం పట్టినా లేదా లేత పసుపు రంగులోనే ఉన్నా అందులో ఇతర నూనెలు కలిశాయని గుర్తించాలి.

రసాయనిక పరీక్షల ద్వారా కూడా నెయ్యి స్వచ్ఛతను తెలుసుకోవచ్చు. ఒక గాజు గ్లాసులో నీటిని తీసుకుని అందులో ఒక స్పూన్ నెయ్యి వేయండి. నెయ్యి నీటిపై తేలితే అది మంచిది, అడుగుకు చేరుకుంటే అందులో ఇతర పదార్థాలు కలిసినట్లు లెక్క. మరో పద్ధతిలో, ఒక గిన్నెలో కొద్దిగా నెయ్యి తీసుకుని దానికి సమానంగా హైడ్రోక్లోరిక్ యాసిడ్, చిటికెడు చక్కెర కలపండి. ఒక ఐదు నిమిషాల తర్వాత నెయ్యి ఎరుపు లేదా గులాబీ రంగులోకి మారితే అందులో వనస్పతి (డాల్డా) కలిసినట్లు నిర్ధారించుకోవచ్చు. పిండి పదార్థాల కల్తీని గుర్తించడానికి అయోడిన్ పరీక్ష బాగా పనిచేస్తుంది. కొద్దిగా నెయ్యిని కరిగించి దానికి రెండు చుక్కల అయోడిన్ ద్రావణాన్ని కలిపినప్పుడు అది నీలం రంగులోకి మారితే అందులో బంగాళాదుంపలు లేదా చిలగడదుంపల గుజ్జు కలిపారని అర్థం.

మార్కెట్లో లభించే నెయ్యి డబ్బాలపై ఉండే 'AGMARK' చిహ్నాన్ని గమనించడం మరొక ప్రాథమిక జాగ్రత్త. స్వచ్ఛమైన నెయ్యిని ఫ్రిజ్‌లో పెట్టినప్పుడు అది సమానంగా గడ్డకడుతుంది. ఒకవేళ అది వేర్వేరు పొరలుగా కనిపిస్తే అందులో రకరకాల నూనెలు కలిపినట్లు స్పష్టమవుతుంది. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా, కల్తీ నెయ్యి విక్రయించే వారి బారి నుండి తప్పించుకోవచ్చు. ఎప్పుడూ నమ్మకమైన డెయిరీల నుండి లేదా ఇంట్లోనే తయారు చేసుకున్న నెయ్యిని వాడటం అన్నింటికంటే ఉత్తమమైన మార్గం.

మరింత సమాచారం తెలుసుకోండి: