తెలుగు సినిమా స్థాయి ఇటీవల పాన్‌ ఇండియా రేంజ్‌కు ఎదిగింది. టాలీవుడ్‌ కథానాయకులు దేశవ్యాప్తంగా సినీ అభిమానులను సొంతం చేసుకుంటున్నారు. తమ మూవీస్‌లో గెస్ట్‌ రోల్ అప్పీయరెన్స్‌ను మరింత ఆకట్టుకునేలా చూసుకుంటున్నారు. ఇందులో భాగంగానే బాలీవుడ్‌ స్టార్స్‌ను తమ సినిమాల్లో నటించేలా చూసుకుని కమర్షియల్‌గా మూవీ మార్కెట్‌ను మరింత పెంచుకుంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌ మెగా స్టార్‌ చిరంజీవి సైతం ఇదే పనిలో నిమగ్నమై ఉన్నారు.

టాలీవుడ్‌ అగ్ర హీరో చిరంజీవి.. చాలా గ్యాప్‌ తర్వాత సినిమాలు మొదలుపెట్టారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగానే కాకుండా జోరుమీద కూడా ఉన్నారు. ప్రస్తుతం చిరంజీవి కథానాయకుడుగా మోహన్‌రాజా తెరకెక్కిస్తున్న పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ 'గాడ్‌ ఫాదర్‌' ఇది మళయాళంలో సూపర్‌ డూపర్‌ హిట్‌ అయిన 'లూసిఫర్‌'కు రీమేక్‌గా తెరకెక్కుతోంది. ఇందులో కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. మళయాళంలోని 'లూసిఫర్‌'లో అదే రోల్‌ను పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ పోషించారు. ఇదే పాత్రను 'గాడ్‌ ఫాదర్‌'లో సల్లూ భాయ్‌ పోషిస్తుండటం విశేషం.

కాగా, ఇప్పటికే మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన చారిత్రక చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో తొలి సమరయోధుడు అయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన 'సైరా నరసింహారెడ్డి' సినిమాలో నరసింహారెడ్డి గురువు అయిన గోసాయి వెంకన్న పాత్రలో బాలీవుడ్ బాద్‌షా, వెటరన్ హీరో అమితాబ్ బచ్చన్‌ నటించిన విషయం తెలిసిందే. 'సైరా నరసింహారెడ్డి' సినిమా విడుదలకు ముందు నుంచి అందులో చిరుతో కలిసి అమితాబ్‌ నటిస్తున్న విషయాన్ని బాగా హైలైట్‌ చేశారు. దీంతో ఆ చిత్రంపై అమితాబ్‌ అభిమానులనే కాకుండా మిగతా ఫ్యాన్స్‌లోనూ క్యూరియాసిటీ పెంచింది. అంతేకాకుండా సైరా నరసింహారెడ్డి ప్రమోషన్‌కు బాగా ఉపయోగపడింది.

ఇక ఇప్పుడు చిరు మరో సినిమా 'గాడ్ ఫాదర్' కోసం సల్మాన్ ఖాన్ రంగంలోకి దిగాడు. ఇప్పటికే సగభాగం షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ మూవీలో సల్లూ భాయ్‌ ఓ అతిథి పాత్రలో కనిపించబోతున్నారని టాక్. ఇదే విషయాన్ని సల్మాన్‌ కూడా కన్ఫమ్ చేశాడు. మరోవైపు మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌... చిరు, సల్మాన్‌ కాంబినేషన్‌లో తెరకెక్కే ఓ హై ఎనర్జిటిక్‌ సాంగ్‌కు ఇప్పటికే ట్యూన్‌ రెడీ చేశాడట. మరి ఆన్‌స్క్రీన్‌పై చిరంజీవి, సల్మాన్‌ ఖాన్‌ కలిసి వేసే స్టెప్పులు ఏ రేంజ్‌లో అభిమానులను అలరిస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: