బాల‌య్య -బోయ‌పాటి కాంబినేష‌న్‌కి ఉన్న క్రేజ్ ఏంటో వారిద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన సినిమాలే చెపుతాయి. సింహా, లెజెండ్‌, అఖండ వ‌రుస‌గా ఒక‌దానిని మించి ఒక‌టి ఘ‌న‌విజ‌యం సాధించిన చిత్రాలివి. ఒక‌ర‌కంగా ఒక‌ప్పుడు సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు కోడి రామ‌కృష్ణ‌, ఆ త‌రువాత బి. గోపాల్ ల త‌రువాత బాల‌కృష్ణ ఇమేజ్‌కు, బాడీ లాంగ్వేజ్‌కు స‌రిప‌డే క‌థ‌ల‌ను ఎంచుకుని ఆ స్థాయిలో బాక్సాఫీసును షేక్ చేసే సినిమాల‌ను తెర‌కెక్కించిన ఘ‌న‌త బోయ‌పాటికే ద‌క్కుతుంద‌ని చెప్పాలి. కాగా బుధ‌వారం అఖండ స‌క్సెస్ మీట్‌లో మాట్లాడుతూ ఓ ప్ర‌శ్న‌కు స‌మాధానంగా అఖండ చిత్రానికి త‌ప్ప‌కుండా సీక్వెల్ ఉంటుంద‌ని ద‌ర్శ‌కుడు చెప్ప‌డంతో బాల‌య్య అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది.
 
గొప్ప విజ‌యం సాధించిన సినిమాల‌కు సీక్వెల్ రావ‌డం స‌హ‌జ‌మే. ఇదేమీ కొత్త‌కాదు.. గ‌తంలో చాలా సినిమాలు ఈ విధంగా తెర‌కెక్కాయి. అయితే మొద‌ట వ‌చ్చిన సినిమా స్థాయిలో అవి విజ‌యం సాధించ‌డం మాత్రం అరుద‌నే చెప్పాలి. చాలా కొద్ది సినిమాల‌కు మాత్ర‌మే ఇది మిన‌హాయింపు. ఎందుకంటే మొద‌ట వ‌చ్చిన చిత్రం కంటే దాని సీక్వెల్‌పై భారీ అంచ‌నాలు నెల‌కొని ఉంటాయి. వాటిని అందుకోవ‌డం అంత తేలికేమీ కాదు. ఒక క‌థ ఫ్రెష్‌గా తెర‌కెక్కిన‌పుడు దానిలోని కొత్త‌ద‌నం ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతుంది. దాని సీక్వెల్ తెర‌కెక్కించాలంటే చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. ప్రేక్ష‌కులు క‌థ‌ను ముందుగా ఊహిస్తారు కాబ‌ట్టి క‌థ‌నంలో ప‌ట్టు, ఉద్వేగ భ‌రిత స‌న్నివేశాలు అవ‌స‌రం. ఇవ‌న్నీ ద‌ర్శ‌కుడికి పెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలి. అందుకే అభిమానుల ఉత్సాహాన్ని పెంచేందుకు ద‌ర్శ‌కుడు బోయ‌పాటి సీక్వెల్ ఉంటుంద‌ని చెప్పినా, అది ఎప్పుడో చెప్ప‌లేన‌ని చెప్పాడు. నిజానికి అఖండ సినిమా క‌థ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న తీరు చూశాక, అది క‌మ‌ర్షియ‌ల్ గా సాధించిన విజ‌యం స్థాయిని చూశాక దాని సీక్వెల్ వ‌స్తే బాగుంటుంద‌ని ఎవ‌రైనా అనుకుంటారు. ఆ క‌థ‌కు ఆ అవ‌కాశం ఉంది కూడా. అయితే బోయ‌పాటి లాంటి మాస్ ప‌ల్స్ తెలిసిన‌ డైరెక్ట‌ర్‌  సీనియ‌ర్ హీరోతో వెంట‌నే మ‌రో సినిమా తీయ‌డానికి సిద్ధ‌మ‌వుతాడ‌ని ఎవ‌రూ అనుకోరు. దానికి చాలా స‌మ‌య‌మే ప‌ట్టొచ్చు. ఒక‌వేళ బోయ‌పాటి అందుకు సిద్ధ‌మైతే మాత్రం బాల‌య్య అభిమానుల‌కు మ‌రో పండుగే.

మరింత సమాచారం తెలుసుకోండి: