తమ్ముడు చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అచ్యుత్ తన పాపులారిటీని అమాంతం పెంచేసుకున్నాడు. డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే తాను నటనపై ఆసక్తి చూపేవాడు. 1983లో రెండు సంవత్సరాల పాటు హైదరాబాద్ నగరంలోని మధు ఫిలిం శిక్షణ కేంద్రంలో నటన నేర్చుకున్నాడు. 1986 సంవత్సరంలో దూరదర్శన్ టీవీ లో ఇంద్రధనస్సు అనే సీరియల్ లో కీలకమైన పాత్రలో నటించాడు. తర్వాత కూడా అనేకమైన సీరియల్స్ లలో నటించి బుల్లితెరపై సూపర్ పాపులారిటీ తెచ్చుకున్నాడు.


ఆపై వెన్నెల వేట, హిమబిందు, ప్రేమ అంటే ఇదే, మిస్టర్ బ్రహ్మానందం, ఇదెక్కడైనా ఉందా అనే సీరియల్స్ లలో నటించి తన పాపులారిటీని తార స్థాయికి తీసుకెళ్లాడు. ఈ సందర్భంలోనే తనకు సినీ ఇండస్ట్రీలో చాలా ఛాన్సులు రావడం ప్రారంభమయ్యాయి. ఐతే 1996 లో అచ్యుత్ తొలిసారిగా జంధ్యాల దర్శకత్వం వహించిన ప్రేమ ఎంత మధురం సినిమా లో నటించాడు. ఆ తర్వాత పట్టుదల సినిమాలో నటించి వెండి తెరపై కూడా మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.


వెంకటేష్ హీరోగా నటించిన వాసు సినిమాలో హీరో చెల్లికి భర్తగా అచ్యుత్ నటించాడు. మెగాస్టార్ చిరంజీవి నటించిన డాడీ సినిమాలో కూడా ఓ ప్రధాన పాత్రలో జీవించేశాడు. ముఖ్యంగా తమ్ముడు చిత్రం లో ప్రధాన పాత్రలో నటించిన అచ్యుత్ తెలుగు ప్రేక్షకులందరికి చాలా దగ్గరయ్యాడు. తన సహజ నటనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది అవార్డును కూడా అందించింది. తన ఫిలిం కెరీర్లో 50 సినిమాలకు పైగా నటించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు అభిమానుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచి పోయాడు. హృదయ సంబంధిత రుగ్మతలతో తీవ్ర అనారోగ్యం పాలైనా అచ్యుత్ 2002వ సంవత్సరంలో గుండెపోటుతో మరణించాడు. ఆయన మరణంతో టెలివిజన్ రంగంలో విషాదచాయలు అలుముకున్నాయి. సినీ పరిశ్రమలో కూడా అతని మరణం తీరని లోటు గా మిగిలిపోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: