రాఘవ లారెన్స్ గురించి తమిళ తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేదు. అంతగా తన డాన్సులతో మరియు నటనతో తెలుగు మరియు తెలుగు రాష్ట్రాల ప్రజల మనస్సులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. లారెన్స్ ఇంతటి సుతఃయికి చేరగలిగాడంటే దాని వెనుక ఎన్నో కష్టాలు, మరెన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఇంతటి స్థాయికి చేరుకోగలిగాడు. లారెన్స్ అతి చిన్న స్థాయి నుండి స్వయం కృషే ఆయుధంగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉన్నత శిఖరాలను అధిరోహించగలిగాడు. ఒక సాధారణ డాన్సర్ గా తన సినీ జీవితాన్ని ప్రారంభించిన ఈయన ఆ తర్వాత కొరియోగ్రాఫర్ గా మారి ఇండస్ట్రీలో కొంతకాలం తన హవాను కొనసాగించాడు.


దానితర్వాత దర్శకుడిగా మారి తీసిన స్టైల్, డాన్, రెబల్, కాంచన సిరీస్  సినిమాలన్నీ మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. నటుడిగా కూడా మంచి పేరునే తీసుకువచ్చాయి. రాఘవ లారెన్స్ లో ప్రతి ఒక్కరికీ నచ్చే మరో కోణం అయన చేసే సేవా కార్యక్రమాలు. ఎంతో మంది చిన్నారులకు గుండె సంబంధిత ఆపరేషన్లు చేయించారు. అంతేకాకుండా యువతీ యువకులకు వారి విద్యకు అవసరమైన సహాయాలు కూడా చేస్తుంటారు. ఇప్పుడు లారెన్స్ పై త్వరలో  రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారని ప్రచారం జరుగుతుంది.  అయితే తన గురువు రజినీకాంత్ పార్టీలో చేరబోతున్నానని చెప్పాడు. ఆయన ప్రకటన తమిళనాట ఆసక్తికరంగా మారింది. కోలీవుడ్ లో చర్చనీయాంశమైంది.


అయితే ఈ సందర్భంగా లారెన్స్  ఓ కండీషన్ పెట్టినట్టు తెలుస్తోంది. రజినీకాంత్ ముఖ్యమంత్రి అభ్యర్థి అయితేనే తాను పార్టీలో చేరుతా అని లారెన్స్ ప్రకటించారట. వేరే వ్యక్తి అయితే అందుకు తాను అంగీకరించబోనని స్పష్టం చేయడం ఆసక్తికరంగా మారింది. రజినీకాంత్ తాను సీఎం అభ్యర్థిని కాదని పార్టీలో అనుభవం వున్న వ్యక్తిని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తానని రజినీ చెప్పిన విషయం తెలిసిందే. రజినీ తన ప్రకటనపై పునరాలోచిస్తారని తాను కోరుతున్నానని చెప్పాడు. రజనీని ఒప్పించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని తెలిపాడు. ఇప్పటికైతే రజినీనే సీఎం అభ్యర్థిగా ఉండాలని, భవిష్యత్తులో మరెవరు ముఖ్యమంత్రి అభ్యర్థి అయినా తనకు అభ్యంతరం లేదని చెప్పాడట. మరి రజినీకాంత్ రాఘవ లారెన్స్ మాట వింటారా ? లేదా తాను ముందుగా ప్రకటించిన విధంగానే వేరే వ్యక్తిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: