స్టార్ హీరోల సినిమాల కోసం ప్రేక్షకులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూడటం సహజమే. అయితే ఆ సినిమాలు చెప్పిన రోజున విడుదల కాలేదంటే ఫ్యాన్స్ నిరాశపడతారు. సినిమా విడుదల తేది ప్రకటించి పలు మార్లు వాయిదా వేసారంటే ప్రేక్షకులను ఇబ్బంది పెట్టినట్టే. ఇలా గత సంక్రాంతి నుంచి ఊరిస్తూ వస్తోంది నాగార్జున చిత్రం ‘డమరుకం’. షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఏడాది దాటినా సినిమా విడుదలకు పలు అడ్డంకులు ఎదురయ్యాయి. చివరికి దసరా రేస్ నుంచి కూడా తప్పుకుంది ఈ సినిమా. అప్పుడు ఇప్పుడు అంటూ ఊరిస్తూ వస్తున్న ఈ సినిమా చివరికి ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  చెప్పిన సమయానికి విడుదల కాకుండా వాయిదా పడుతున్న మరో చిత్రం విజయ్-కాజల్ నటించిన తుపాకీ. మురగదాసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ నవంబర్ 9 నుంచి నవంబర్ 13కి వాయిదా పడింది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న లక్ష్మిప్రసన్న మూవీ 'గుండెల్లో గోదారి' కూడా పలుమార్లు వాయిదాపడుతోంది. దసరా రేస్ నుంచి తప్పించిన ఈ సినిమా విడుదల తేదిని ఇప్పటికీ ఫైనల్ చేయలేకపోతున్నారు. వాయిదాపద్దతిలో వెంకటేష్-మహేష్ కాంబినేషన్ లో వస్తున్న మల్టీస్టారర్ మూవీ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' కూడా చేరబోతోందని మరో టాక్. ఈ సినిమాను క్రిస్మస్ లేదా ఇయర్ ఎండ్ సీజన్ లో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అందుకోసం డిసెంబర్ 21కి ఈ సినిమా విడుదల అనుకున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి దాదాపు 40రోజుల షూటింగ్ వర్క్ తో పాటూ ఎడిటింగ్ వర్క్ కూడా పెండింగ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 21కి ఈ సినిమా విడుదల కాకపోవచ్చని, వచ్చే ఏడాది ప్రారంభంలో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని ఫిలింనగర్ వర్గాల్లో వినిపిస్తోంది. వెంకీ-మహేష్ కాంబినేషన్ మూవీ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ మాత్రం సినిమా విడుదల పడుతుందని టాక్ రావడంతో నిరాశపడుతున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రభాస్ మూవీ 'రెబల్' పలుమార్లు వాయిదా పడింది. షూటింగ్ పూర్తి చేసుకున్న నాగచైతన్య మూవీ 'అటోనగర్ సూర్య' కూడా ఈ నెలలో విడుదల కావాల్సింది. అయితే డిసెంబర్ కు సినిమాను వాయిదా వేసినట్టు తెలుస్తోంది. ఇలా వరుసగా సినిమాలు వాయిదా పడుతున్నాయి. ప్రేక్షకులకు ఊరిస్తూ ఊసురుమనిపిస్తున్నాయి. మరి వాయిదా పద్దతి మేలు చేస్తుందా, కీడు చేస్తుందా అనేది ఆ సినిమాల రిజల్టే తేల్చి చెప్పబోతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: