దాదాపు ఏడేళ్ల విరామం తరువాత సిద్ధార్థ్‌ తెలుగు ఇండస్ట్రీలోకి మహా సముద్రం అనే సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో శర్వానంద్ తో కలిసి ప్రధాన పాత్రలో సిద్ధార్థ్ నటించారు. తొలి సినిమా "Rx100 " తోనే దర్శకత్వ ప్రతిభ చాటుకున్న అజయ్‌ భూపతి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. వైజాగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై రామ బ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగస్టు 19న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఒకప్పుడు బాయ్స్, బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, కొంచెం ఇష్టం కొంచెం కష్టం వంటి చిత్రాల్లో నటించి లవర్ బాయ్ గా మంచి పేరు తెచ్చుకొని యూత్ హీరో అనిపించుకున్న ఈ నటుడు ఆ తర్వాత పెద్దగా హిట్లు సాధించలేదు.

అనంతరం ప్రయోగాత్మక సినిమాలతో ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. అయితే ఇన్నాళ్ళకి మళ్ళీ తెలుగులో స్ట్రెయిట్ సినిమాతో మళ్లీ తెరపైకి రాబోతుండడంతో ఈయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మహా సముద్రం సినిమా సిద్దార్థ్ ని తిరిగి లవర్ బాయ్ గా కొనసాగిస్తుందని ఆశిస్తున్నారు. అయితే నేడు సిద్ధార్థ్ పుట్టినరోజు సందర్భంగా అతనికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ `మహా సముద్రం` నుంచి ఫస్ట్ లుక్ ని విడుదల చేసి సిద్దు ఫ్యాన్స్ కి గిఫ్ట్ ఇచ్చారు మేకర్స్. ఇందులో సిద్ధూ టీ-షర్టుపై చొక్కా ధరించి ఓ క్యూ లో నిలబడి పక్కకు జరిగి చూస్తున్నాడు.

ఈ లుక్ లో అప్పటి లవర్ బాయ్ కనిపిస్తున్నాడు అంటూ, బొమ్మరిల్లు హీరో ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్లు పెడుతున్నారు అభిమానులు. తమ అభిమాన నటుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడంతో పాటు ఈ సినిమా తనకి పెద్ద సక్సెస్ ని ఇచ్చి తిరిగి కెరీర్ లో ముందు లాగా సినిమాలతో బిజీగా మారాలని కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: