సిల్క్ స్మిత.. సినీ ప్రేక్షకులకు హృదయాల్లో నిలిచిపోయిన పేరు ఇది..ఆమె ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ సంచలనం సృష్టించింది. సిల్క్ స్మిత..
పేరులోనే ఓ వైబ్రేషన్ ఉంది. తన మత్తుకళ్లు చూస్తే మతి చెదిరేది. తేనెలూరే పెదవులు నవ్వులు రువ్వితే గుండెలు లయ తప్పేవి. తీగ నడుమును కదుపుతూ ఆమె నాగినిలా నాట్యం చేస్తుంటే కళ్లు రెప్పలు వేయడం మర్చిపోయేవి. ఆమె ఉంటేనే సినిమా. తనది హీరోయిన్లను మించిన హవా. కట్ చేస్తే.. ఆమె లేదు. ముప్ఫై అయిదేళ్ల వయసులో ఉన్నట్టుండి ఉరితాడుకు వేళ్లాడింది. తన ఊపిరితో పాటు జవాబు లేని ఎన్నో ప్రశ్నల్ని కూడా వదిలేసి వెళ్లింది సిల్క్. ఈ రోజు ఆమె వర్ధంతి. సిల్క్ స్మిత 1996 సెప్టెంబరు 23న సూసైడ్ చేసుకుంది. ఇప్పటికీ ఆమె మరణం ఓ అంతుచిక్కని కథలా మిగిలిపోయింది.

మేకప్‌ ఆర్టిస్ట్ గా

సిల్క్ స్మిత తొలి చిత్రం బండి చక్రంలో తాను పోషించిన సిల్క్‌ పాత్రనే తన ఇంటి పేరుగా మార్చుకుంది. ఈ అందాల ధ్రువ తార ఇండస్ట్రీలో మేకప్‌ ఆర్టిస్ట్ గా తన ప్రస్థానం మొదలుపెట్టి సీతాకోక చిలుక, వసంత కోకిల వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. అప్పట్లో స్టార్ హీరోల సినిమాల్లో సిల్క్ స్మిత డ్యాన్స్‌ బీట్‌ లేనిదే ఒక్క సినిమా కూడా ఉండకపోయేది. అందుకే ఆమెకు ఇండస్ట్రీలో అంత క్రేజ్ ఉండటంతో హీరోలకు సరి సమానంగా రెమ్యునరేషన్ తీసుకుంది.

ఎవరి మాటా వినలేదు

సిల్క్ స్మిత ఎందుకిలా చేసింది? అంత కష్టం ఏమొచ్చింది? ఏదో అయ్యిందంట.. అదేంటో ఎవరికీ తెలియదు అంటారు కొందరు. మోసపోయిందట.. మనసు విరిగి వెళ్లిపోయిందంటారు మరికొందరు. ఆమె నడిచిన దారే అంత, అందుకే ఈ ముగింపు అంటారు గిట్టనివాళ్లు. ఎవరి మాటా వినలేదు.. అందుకే జీవితంలో గెలవలేదు అంటారు కళ్లు కుట్టినవాళ్లు. అవును నిజమే.. తను ఎవ్వరి మాట వినలేదు. విజయ లక్ష్మిగా ఎక్కడో ఏలూరులో పుట్టి.. చిన్న వయసులోనే ఇంట్లోవాళ్లు పెళ్లి చేస్తామంటే పారిపోయి వచ్చి మేకప్‌ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టి.. డ్యాన్సర్‌గా రూపాంతరం చెంది.. సిల్క్ స్మితగా చరిత్ర సృష్టించింది. చిన్నా పెద్దా.. ముసలీ ముతకా.. అందరి మనసుల్లోకీ వాళ్ల అనుమతి లేకుండానే చొరబడింది. ఈ ఇమేజ్ నీకు అవసరమా, ఇలాంటివి చేయకు అంటూ వెనక్కి లాగాలని చూశారు కొందరు. వాళ్ల మాట తను వినలేదు. తిరుగులేని తారగా ఎదుగుతున్న ఆమెను తమ గుప్పిట పట్టి బంధించాలని ప్రయత్నించారు కొందరు. వాళ్ల మాటా వినలేదు. ప్రేమ పేరుతో దగ్గర చేరి, నమ్మించి వంచించేవాళ్లకి దూరంగా ఉండమని తెలిసినవాళ్లు చెప్పారు. వారి మాటా వినలేదు.
ఏమాత్రం లెక్క చేయని సిల్క్‌ ఎందుకింతగా కుంగిపోయింది? శృంగారతారని చేశారు. ఆరాధ్యదేవతను చేసి కొలిచారు. అంగాంగవర్ణనలో ఆనందం పొందారే తప్ప ఆ తనువు మాటునున్న మనసును గుర్తించలేకపోయారని కుమిలిందా? స్టార్ హీరోలు సైతం తమ సినిమాలో సిల్క్ ఉండాలన్నారు. తన పాట ఉంటేనే సినిమా కొంటామని డిస్ట్రిబ్యూటర్లు సైతం పట్టుబట్టారు. తన పేరు వాడుకుని తమకు కావాల్సింది సంపాదించుకున్నారే తప్ప తనకేం కావాలో ఎవ్వరూ అడగలేదేమో అని అలిగిందా? సినీ ప్రపంచంలోని రంగులన్నింటినీ పులుముకుని సీతాకోక చిలుకలా ఎరగింది. కానీ చివరికి నల్లని చీకటి మాత్రమే మిగిలిందంటూ మనసులోనే మథనపడిపోయిందా? ఈ ప్రశ్నలకు జవాబులు వెతకని ఈ సమాజానికి సిల్క్ పేరు తలచుకునే అర్హత ఉందా? యేటా ఈ రోజున ఆమె చనిపోయిందని తలచుకున్నంత మాత్రాన సిల్క్ ఆత్మ శాంతిస్తుందా? మత్తు చల్లిన కళ్లల్లో మనకి కనిపించనిదేదో ఉందనే విషయం గుర్తించలేదు. అందంగా విచ్చుకునే పెదవుల మాటున మనం వినాల్సిన పలుకులేవో మిగిలిపోయాయని తెలుసుకోలేదు.

ఎందుకిలా చేసిందో తెలీదు

సిల్క్ అంటే అందమే కాదు.. అంతకు మించి ఏదో ఉందనే నిజాన్ని ఎవరూ గుర్తించలేదు. సెక్సీ స్టార్‌ అంటూ ఫ్లెక్సీలు కట్టాం. తనకి తనే సాటి అంటూ డర్టీ పిక్చర్లు తీస్తాం. సిల్క్ కోరుకున్నది ఇదేనా? సిల్క్ కు మనం ఇవ్వగలిగింది ఇంతేనా? అంటే తెలీదు. సిల్మ్ ఎందుకిలా చేసిందో తెలీదు. సిల్క్ కోసం ఈ లోకం ఏం చేసిందో కూడా తెలీదు. కానీ ఒక్కటి మాత్రం కచ్చితంగా తెలుసు. సిల్క్‌ ఈజ్ సిల్క్. తనలా ఎవరూ లేరు. ఎప్పటికీ రారు. తామరాకు మీది నుంచి నీటి చుక్క జారినట్టు..ఇప్పటికీ ఆమె సినిమానో, పాటనో చూసినప్పుడు ప్రేక్షకుడి కన్నుల నుంచి జారిపడే కన్నీటి చుక్కే అందుకు సాక్ష్యం.

మరింత సమాచారం తెలుసుకోండి: