
రామారావు గానీ, నాగేశ్వరరావు గానీ, కృష్ణ గారు గానీ, శోభన్ బాబు గానీ ఇప్పటి వరకు ఎవరు ఎంత రెమ్యునరేషన్ తీసుకొన్నారో చెప్పలేదు. ఎవరికి ఎంత ఇచ్చారనే విషయం ఎవరికైనా తెలుసా? నిజానికి ఒకరు మైక్ పట్టుకొని రోజుకు రెండు కోట్లు తీసుకొంటాను. ఆరు కోట్లు తీసుకొంటాను. 40 రోజులకు 80 కోట్లు తీసుకొంటానని చెబుతుంటాడు అని పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి కోట శ్రీనివాస రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
రెమ్యునరేషన్ ఎంత తీసుకొంటామనేది చెప్పడం మంచి పద్దతి కాదు. ఆ రోజుల్లో ఎన్టీరామారావు 67 ఏళ్ల వయసులో శ్రీదేవి నటిస్తుంటే.. ఆయన వయసు ఎవరికి తెలియదు. రామారావు, శ్రీదేవీ బాగా చేశారని చెప్పుకొనే వారు. ముసలాయన చేశాడని ఎవరు అనలేదు. నేను ఇప్పుడు నటిస్తే.. ముసలాయన నటిస్తున్నాడు అంటారు. కాబట్టి ఎన్టీఆర్ మహానుభావుడు. ఆయన ఎంత తీసుకొన్నారనే విషయం బయటకు చెప్పలేదు అని కోట శ్రీనివాసరావు అన్నారు.
ఇదిలా ఉండగా, కొద్దికాలంగా మెగా హీరోలపై కోటా శ్రీనివాసరావు ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు. మా ఎన్నికల సమయంలో నాగబాబు చేసిన వ్యాఖ్యలతో కోట మనస్తాపానికి గురయ్యారు. అప్పటి నుంచి ఆయన ఏదైనా సభలో పాల్గొంటే నాగబాబు, పవన్ కల్యాణ్‌పై విరుచుకు పడుతున్నారు. తాజాగా కోట శ్రీనివాస్ రావు చేసిన వ్యాఖ్యలు మరింత వివాదంగా మారాయి.
ఇటీవల జనసేన పార్టీ సభలో వైసీపీ నేతల విమర్శలపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఘాటుగా స్పందిస్తూ.. నేను ఎవరి వద్ద నుంచి ప్యాకేజీ తీసుకోవాల్సిన పనిలేదు. నేను రోజుకు 2 కోట్ల రూపాయాలు సంపాదిస్తున్నాను. ఒక సినిమాకు 40 రోజులు పనిచేస్తే..80 కోట్ల రూపాయల పారితోషికం పుచ్చుకొంటున్నాను. ఇంకోసారి నేను ప్యాకేజ్ తీసుకొంటున్నానని అంటే.. చెప్పుతో కొడుతాను అని పవన్ కల్యాణ్ ఘాటుగా స్పందించారు.