
ఇది ప్రేక్షకుల్లో అనుబంధాన్ని తగ్గించేస్తోంది. ఇలాంటి ట్రెండ్ ఇప్పుడు తమిళ స్టార్ హీరో సూర్య సినిమా వరకూ చేరడం కొంత మందిలో అసహనాన్ని కలిగిస్తోంది. గత ఏడాది విడుదలైన ‘కంగువ’ టైటిల్ సైతం తెలుగువారి భావోద్వేగాలకు దూరంగా ఉందన్న అభిప్రాయాలు వచ్చాయి. తాజాగా ఆయన నటిస్తున్న కొత్త సినిమానికి ‘కరుప్పు’ అనే పేరు ఖరారు చేయడం చర్చనీయాంశమైంది. దర్శకుడు ఆర్జే బాలాజీ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో హీరో పాత్ర పేరు కరుప్పుస్వామి, దానిని షార్ట్ చేసి "కరుప్పు" అని టైటిల్ పెట్టారు. కాని తెలుగు వెర్షన్‌కూ అదే పేరును వాడాలని ఉద్దేశించడంపై నెగటివ్ రిప్లైలు వస్తున్నాయి. "కరుప్పు" అంటే తమిళంలో "నలుపు" అనే అర్థం ఉన్నా, తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఇది అర్థం కాని పదం. టైటిల్ చదివితేనే సినిమా తమిళ చిత్రమేనన్న భావన మొదటలోనే జనాల్లో ఏర్పడుతుంది. ఇది మల్టీప్లెక్స్ వర్గాన్ని ఎలాగైనా ఆకర్షించినా, మాస్ సెంటర్లలో మాత్రం కనెక్ట్ కాదన్నది స్పష్టమవుతోంది.సూర్యకు తెలుగులో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అయితే ఆయన వంటి హీరోలు కూడా తెలుగు మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని టైటిల్స్ ఎంపికపై ప్రత్యేక శ్రద్ధ చూపకపోతే, అభిమానుల్లో అసంతృప్తి కలగడం సహజం. ఓ వైపు సౌత్ సినిమాలకు పాన్ ఇండియా రేంజ్ వచ్చిందని చెప్పుకుంటూ, మరోవైపు ప్రాంతీయ ప్రేక్షకుల భాషా భావోద్వేగాలను పక్కన పెడితే ఎలా? తెలుగు పేర్లు పెడితే ఏమైపోతుంది? అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా మంది ఫ్యాన్స్ అడుగుతున్న ప్రశ్న. ఉదాహరణకు ‘కరుప్పు’కి ‘నలుపు నీడ’, ‘నల్ల సింహం’ లేదా పాత్రకు తగినట్లు మరేదైనా తెలుగులో అర్థవంతమైన పేర్లు పెట్టవచ్చుగా? అని సూచిస్తున్నారు. మొత్తానికి, పరభాషా సినిమాల అనువాదంలో టైటిల్‌కు అంతగా ప్రాధాన్యం ఇవ్వని విధానం ఇప్పుడు తిరస్కారానికి గురవుతోంది. ఒకే సినిమా కథను ఎన్ని భాషల్లోనైనా చెయ్యచ్చు. కానీ, ప్రతి భాషలో అక్కడి మనసుకు తగిన పద్ధతిలో చెబితేనే ప్రేక్షకుడు సినిమాకు దగ్గరపడతాడు. టైటిల్ అనేది ఆ ప్రయాణానికి గేట్వే. ఆ గేటే తప్పితే, లోపల ఏదైనా ఉన్నా తలుపు దాటే మనిషే ఉండడు. ఇది సినీ మేకర్స్ గుర్తుంచుకోవాల్సిన విషయం.