
రాబోయే ఆగస్ట్ 14న రిలీజవుతున్న ‘వార్ 2’, ‘కూలీ’ సినిమాల కోసం ఏపీ ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. సింగిల్ స్క్రీన్లలో రూ.75, మల్టీప్లెక్స్‌లలో రూ.100 అదనంగా వసూలు చేసుకోవడానికి అనుమతి లభించింది. అదే సమయంలో, తెలంగాణలో మాత్రం నిర్మాతలు భారీ కసరత్తులు చేసినా ఫలితం లేకపోయింది. "కూలీ" సినిమాకి మల్టీప్లెక్స్ టికెట్ 460 రూపాయలు అవుతుందని ఒక దశలో ప్రచారం సాగింది. ఈ విషయం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. "తమిళనాడులో ఈ సినిమాను 175 రూపాయలకు చూస్తుంటే, ఇక్కడ మూడు రెట్లు ఎందుకు ఖర్చు చేయాలి?" అని సినీప్రియులు మండిపడ్డారు.
ఇక ‘వార్ 2’ పరిస్థితి కూడా ఇదే. బిగ్ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ అయినా, డబ్బింగ్ సినిమా కావడంతో తెలంగాణ ప్రభుత్వం రేట్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీంతో రెండు సినిమాలూ తెలంగాణలో సాధారణ రేట్లతోనే ప్రేక్షకులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ నిర్ణయం సినీ అభిమానుల్లో మిశ్రమ స్పందన తెచ్చింది. కొందరు "సాధారణ ప్రేక్షకులకి ఇది గుడ్ న్యూస్" అంటుంటే, నిర్మాతలు మాత్రం "మా కలెక్షన్లపై బాగా ప్రభావం పడుతుంది" అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి, టికెట్ రేట్లలో తెలంగాణ - ఏపీ ప్రభుత్వాల భిన్న నిర్ణయాలు, ‘వార్ 2’ మరియు ‘కూలీ’ క్రేజ్ కలిపి, ఈ వారాన్ని పూర్తిగా హాట్ టాపిక్‌గా మార్చేశాయి. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద ఎవరు గెలుస్తారు, ఎవరికి లాభం జరుగుతుంది అన్నది ఆగస్ట్ 14 తర్వాతే తెలుస్తుంది!