
ఆదివారం రోజున చిరంజీవి నిర్మాతలతో, సినీ కార్మిక సంఘాలతో విడివిడిగా సమావేశమై చర్చలు జరపనున్నారు. ఆ తరువాత ఇరువర్గాలకు ఆమోదయోగ్యంగా ఉండేలా ఒక ఫైనల్ డెసిషన్ తీసుకువచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, చిరు మధ్యవర్తిత్వం తర్వాత సమ్మె విరమణ అవుతుందని, సోమవారం నుంచే చిత్రీకరణలు పునఃప్రారంభం కానున్నాయని టాక్ నడుస్తోంది. అయితే, కొన్ని రోజుల క్రితం నుంచే “చిరంజీవి 30 శాతం వేతనాల పెంపునకు అంగీకరించారని” ప్రచారం జరిగింది. ఆ వార్తలను మెగాస్టార్ తానే ఖండిస్తూ, ఎటువంటి హామీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి మరింత సీరియస్‌గా మారడంతో ఆయనకే పూర్తి బాధ్యత అప్పగించబడింది. ఈసారి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో పరిశ్రమ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది.
ఇప్పటికే సమ్మె కారణంగా అనేక పెద్ద సినిమాల షూటింగ్స్ నిలిచిపోవడంతో రిలీజ్ డేట్స్ గందరగోళంలో పడ్డాయి. చివరి షెడ్యూల్స్ జరుగుతున్న సినిమాలు డైరెక్ట్‌గా ప్రభావం ఎదుర్కొంటున్నాయి. ఇకపై సమ్మె ఎక్కువ రోజులు కొనసాగితే, ఆర్థికంగా నిర్మాతలు భారీగా నష్టపోతారని ఫిలిం వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చొరవతో సమస్యకు పరిష్కారం దొరకవచ్చని ఆశలు పెరిగాయి. చిరంజీవి మధ్యవర్తిత్వం ఫలిస్తే, ఈ ఆదివారం నుంచే టాలీవుడ్ మళ్లీ కదలికలోకి వచ్చే అవకాశం ఉంది. ఇక చూడాలి.. మెగాస్టార్ జోక్యం వల్ల కార్మికుల సమ్మెకు ఎండ్ కార్డ్ పడుతుందా లేక మరిన్ని రోజులు సాగుతుందా అనేది!