ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా చిరంజీవి మానియా స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికాలో బుకింగ్స్ మొదలైన సమయంలో అమ్మకాలు కాస్త నెమ్మదిగా సాగడంతో, ప్రీమియర్స్ కలెక్షన్లు తక్కువగా ఉంటాయని ట్రేడ్ వర్గాలు భావించాయి. కానీ ‘రాజాసాబ్’ విడుదలైన తర్వాతి రోజు నుండే ‘మన శంకర వరప్రసాద్ గారు’ బుకింగ్స్ అనూహ్యంగా పుంజుకున్నాయి. ఫలితంగా ఈ సినిమా ప్రీమియర్ షోల ద్వారానే 1.2 మిలియన్ డాలర్ల వసూళ్లను సాధించి అద్భుతమైన ఘనతను నమోదు చేసింది. చిరంజీవి కెరీర్‌లో వన్ మిలియన్ మార్కును ప్రీమియర్లతోనే దాటడం బాక్సాఫీస్ వద్ద ఆయన తిరుగులేని ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించింది.
ఈ భారీ వసూళ్ల నేపథ్యంలో దర్శకుడు అనిల్ రావిపూడి ఒక ఆసక్తికరమైన చిక్కులో పడ్డారు. సినిమా ప్రమోషన్ల సమయంలో నిర్మాత సాహు గారపాటి ఒక రహస్యాన్ని బయటపెట్టారు. గతంలో ‘భగవంత్ కేసరి’ సినిమా విజయం సాధించినప్పుడు సాహు అనిల్‌కు ఒక కారును బహుమతిగా ఇచ్చారు. అయితే ఈసారి రివర్స్‌లో అనిల్ రావిపూడి నిర్మాతకు కారు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం అమెరికాలో ఈ సినిమా ప్రీమియర్ల ద్వారా వన్ మిలియన్ డాలర్ల మార్కును అందుకుంటే, తాను నిర్మాతకు కారు కొని ఇస్తానని అనిల్ ఛాలెంజ్ చేశారట. అప్పట్లో ఆ మార్కును అందుకోవడం కష్టమని భావించిన అనిల్, ఇప్పుడు సినిమా సాధించిన విజయంతో తన మాట నిలబెట్టుకోవాల్సిన సమయం వచ్చింది.
అనిల్ రావిపూడి అంచనా నిజమవ్వడం, సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రావడం చిత్ర బృందంలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. సంక్రాంతి సెలవుల ప్రభావంతో రాబోయే రోజుల్లో ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. మరి తన ఛాలెంజ్ ప్రకారం అనిల్ రావిపూడి నిర్మాత సాహు గారపాటికి కారును బహుమతిగా ఇస్తారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి