
`వన్ లైఫ్` అనే సూసైడ్ ప్రివెంటివ్ హెల్ప్‌లైన్ సంస్థ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా కొన్ని షాకింగ్ ఫ్యాక్ట్స్ వెల్లడించింది. ప్రతి సంవత్సరం ఆత్మహత్యల సంఖ్య పెరగానికి బ్రేకప్స్ ప్రధాన కారణమని వన్ లైఫ్ వెల్లడించింది. బ్రేకప్స్ తర్వాత జీవితం ఇక్కడితో ముగిసిపోయింది అన్న భ్రమ, తట్టుకోలేని ఆవేదన, దెబ్బ తిన్న మనసు యువతను తప్పుడు నిర్ణయాల వైపు నెడుతున్నాయని సదరు సంస్థ వెల్లడించింది.
బ్రేకప్స్ మాత్రమే కాదు.. అప్పులు, నిరుద్యోగం, కుటుంబ కలహాలు, ఆర్థిక మోసాలు, బెట్టింగ్, ఒత్తిడి వంటి కారణాల వల్ల కూడా చాలా మంది బలవంతంగా తమ ప్రాణాలను తీసుకుంటున్నారు. సూసైడ్ ఆలోచనలతో ఏటా సగటున 23 వేల మంది తమ సంస్థకు ఫోన్ కాల్స్ చేస్తారని.. అలా ఫోన్ చేసే వారందరికీ కౌన్సిలర్లు సానుభూతి చూపుతూ, వారిలో ధైర్యం నింపుతూ, కొత్తగా ఆలోచించే దిశలో తీసుకెళ్తామని వన్ లైఫ్ వివరించింది.
కాగా, బ్రేకప్ అయినా, ఆర్థిక కష్టాలైనా, ఇతర సమస్యలైనా.. ఆత్మహత్య ఎప్పుడూ పరిష్కారం కాదు. ప్రాణం కోల్పోవడం సులువు.. కానీ తిరిగి రప్పించడం అసాధ్యం. సో.. సమస్యను పంచుకుంటే, తప్పకుండా దానికి ఒక దారి దొరుకుతుంది. ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే.. ప్రతి జీవితం విలువైనదే. ప్రతి రోజు ఒక కొత్త ఆరంభమే.