- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మహేష్ బాబు - రాజమౌళి కాంబోలో వస్తున్న సినిమా గురించి టాలీవుడ్ అంతా ఎదురు చూస్తోంది. భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా నిలుస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఈ నెల 15న ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ కానుంది. ఆ సందర్భంగా హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ ఈవెంట్‌కి ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. 100 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన స్క్రీన్‌పై గ్లింప్స్‌ను ప్రదర్శిస్తార‌ని స‌మాచారం. అభిమానుల్లో మాత్రం ఈ ఈవెంట్‌పై అంచనాలు పీక్‌కు చేరాయి. ఇప్పటికే యూనిట్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్న ఫృథ్వీరాజ్ సుకుమారన్ లుక్‌ను విడుదల చేసింది. “కుంభ” అనే పేరుతో ఆయన పాత్రను పరిచయం చేయగా, ఆ లుక్‌పై సోషల్ మీడియాలో విభిన్న స్పందనలు వినిపిస్తున్నాయి.


కొంతమంది ప్రేక్షకులు పాత సినిమాల విలన్‌లతో పోలుస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. కానీ, మరోవైపు “కుంభ” అనే పేరుతోనే రామాయణానికి ఈ కథకు లింక్ ఉందన్న ఊహాగానాలు మరింత బలపడుతున్నాయి. రామాయణంలో కుంభుడు కుంభకర్ణుడి కుమారుడు, రామ - రావణ యుద్ధంలో పాల్గొన్న రాక్షసుడు. చివరికి సుగ్రీవుడి చేతిలో ఆయన వధించబడ్డాడు. ఈ నేపథ్యంలో సినిమాలో సుగ్రీవుడి పాత్రలో ఎవరు నటించబోతున్నారు అన్న ఆసక్తి పెరిగింది. మరోవైపు, మహేష్ బాబు పాత్ర రాముడి లేదా హనుమంతుడి ప్రేరణతో రూపుదిద్దుకుందనే చర్చ వినిపిస్తోంది. గ్లింప్స్‌లో ఆ అంశంపై ఓ క్లూ దొరకొచ్చని అభిమానులు ఎదురు చూస్తున్నారు.


అలాగే ప్రియాంకా చోప్రా కీలక పాత్రలో కనిపించనున్నారని, ఆమె పాత్ర కూడా పురాణపాత్రల ప్రేరణతో ఉండొచ్చని సమాచారం. మాధవన్ కూడా ముఖ్యమైన రోల్‌లో కనిపించనున్నారని సినీ వర్గాల టాక్. మొత్తం మీద, రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్‌లో పురాణాల స్ఫూర్తి, ఆధునిక కథనం కలబోతగా ఉండబోతోందని తెలుస్తోంది. నవంబర్ 15న విడుదల కాబోయే గ్లింప్స్ ఈ మిస్టరీకి తెరతీసే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: