టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఓజీ సినిమా ఎంతటి సంచలనమైన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ సినిమా విజయోత్సాహం ఇంకా తగ్గకముందే, ఆయన నటిస్తున్న మరో భారీ ప్రాజెక్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ గురించి అభిమానుల్లో ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. పవన్ సరసన రాశీ ఖన్నా, శ్రీలీల నటిస్తుండగా, ఇప్పటికే విడుదలైన పోస్టర్లు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేకెత్తించాయి. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ - హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో, దీనిపై అభిమానులకు ప్రత్యేకంగా హైప్ ఏర్పడింది. అంతేకాదు, తమిళంలో విజయ్ - అట్లీ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్ తేరి సినిమాకు ఇది రీమేక్ అన్న వార్తలు సోషల్ మీడియాలో చాలా కాలంగా చక్కర్లు కొడుతున్నాయి.
అయితే ఈ విషయంపై సినిమా యూనిట్ స్పష్టమైన ధృవీకరణ ఇవ్వకపోయినా, కథలో పవన్ స్టైల్‌కు తగిన మార్పులు చేసినట్లు సమాచారం. పవన్ ఎన్నికల ముందు ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. పదవి చేపట్టిన తర్వాతే షూటింగ్‌ను ప్రారంభించగా, కాస్త గ్యాప్ వచ్చినా మొత్తం షూటింగ్‌ను పూర్తిచేసేశారు. దీంతో సినిమా రిలీజ్‌కు సిద్ధమవుతుందన్న ఆనందంలో అభిమానులు ఉన్నా... ఇప్పటి వరకు మేకర్స్ నుంచి ఒక్క అధికారిక అప్డేట్ కూడా రాకపోవడంతో కొంత ఆతృత నెలకొంది. రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారో అని పవర్ స్టార్ అభిమానులు రోజూ సోషల్ మీడియాలో ట్రెండ్లు సృష్టిస్తూ ఎదురు చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో నిర్మాత నవీన్ యెర్నేని - రవిశంకర్‌లు నిర్మిస్తున్న మరో సినిమా ఆంధ్రా కింగ్ కన్నడ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వై. రవిశంకర్ ఉస్తాద్ భగత్ సింగ్‌పై కీలకమైన సంకేతం ఇచ్చాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఆయన ప్రకటించడంతో అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఖచ్చితమైన రిలీజ్ డేట్‌ను చాలా త్వరలోనే అధికారికంగా వెల్లడించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గబ్బర్ సింగ్ స్థాయి విజయాన్ని మళ్లీ రిపీట్ చేయగలరా ? పవన్ – హరీష్ శంకర్ కాంబో మళ్లీ బ్లాక్‌బస్టర్ మ్యాజిక్ చూపుతుందా? అన్న ప్రశ్నలకు సమాధానం కోసం ఇప్పుడు అందరి చూపులు సమ్మర్ 2026 వైపు మళ్లాయి. పవన్ మాస్ ఎంటర్‌టైనర్ కోసం తీవ్రంగా ఎదురు చూస్తున్న అభిమానులు ఈ సారి అలరించే కాంబోను పెద్ద హిట్టుతో చూసేందుకు సిద్ధమవుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి