మరికొన్ని గంటల్లో వెండితెరపైకి రానున్న అఖండ 2 చిత్రంలో నటి సంయుక్త మీనన్ కనిపించనున్న సంగతి విదితమే. ఈ సందర్భంగా ఆమె తన సినీ ప్రయాణం, పాత్రల ఎంపికపై తన మనసులోని మాటలను పంచుకున్నారు. తాను ఎంతో నమ్మకాన్నిచ్చిన కథలతోనే ముందుకు సాగుతున్నానని, ఆ నమ్మకానికి తగినట్టు ఆ కథలు ప్రేక్షకులకు నచ్చినప్పుడే తనకు నిజమైన తృప్తి లభిస్తుందని ఆమె స్పష్టం చేశారు. అందుకే, సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులకు అభిప్రాయాన్ని సైతం తాను కీలకంగా పరిగణిస్తానని ఆమె వ్యాఖ్యానించారు.
అఖండ 2లో తన పాత్ర గురించి మాట్లాడే క్రమంలో దర్శకుడు తనకు ఇచ్చిన ఆదేశాలను ఆమె గుర్తు చేసుకున్నారు. సినిమాలో ఆమె పాత్రకు సంబంధించిన వివరాలను ఎవరికీ చెప్పవద్దని దర్శకుడు సూచించారని ఆమె వెల్లడించారు. తన పాత్ర చాలా స్టైలిష్‌గా ఉంటుందని, ఎక్కువగా సూట్స్ ధరిస్తానని మాత్రమే ఆమె తెలిపారు. సినిమాలో తన పాత్ర చుట్టూ ఒక బలమైన ఘట్టం ఉందని, ప్రస్తుతానికి దీనికి మించి తాను ఏమీ చెప్పలేనని సంయుక్త పేర్కొన్నారు. సినిమాలోని కొన్ని సన్నివేశాలు చూశాక తనకే షాకింగ్‌గా అనిపించాయని, అందుకే డేట్స్ లేకపోయినా ఈ సినిమా కోసం సమయం కేటాయించానని ఆమె తెలిపారు.
ఈ చిత్రం గురించి ఆమె మరో ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. ఇంతవరకు తనకు మాస్ సాంగ్ చేసిన అనుభవం లేదని, అయితే అఖండ 2లో ఏకంగా 500 మంది డ్యాన్సర్లతో కలిసి ఒక మాస్ సాంగ్‌లో పాల్గొన్నానని ఆమె చెప్పుకొచ్చారు. వ్యక్తిగతంగా తనకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువని తెలిపారు. కథల ఎంపిక విషయంలో సతమతమవుతున్న సమయంలో, ఈ విషయంలో దేవుడే తనకు దారి చూపాలని మనసారా కోరుకున్నానని, అలా కోరుకున్న మరుసటి రోజే శివుడి పేరున్న ఒక పాత్రలో ఛాన్స్ దక్కిందని ఆమె అనుభవాన్ని పంచుకున్నారు. మొత్తంగా, తన సినీ ప్రయాణం విషయంలో తాను పూర్తి సంతృప్తిగా ఉన్నానని సంయుక్త మీనన్ తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి