‘నరసింహనాయుడు’ తర్వాత నందమూరి బాలకృష్ణ కెరీర్ కొంత ఒడిదుడుకులకు గురైనది నిజం. సుదీర్ఘ కాలం ఆయనకు పెద్ద హిట్ రాకపోవడంతో “ బాలయ్య ఫామ్‌లోకి వస్తారా ? ” అనే అనుమానాలు వినిపించాయి. కానీ సింహా సూపర్ డూపర్ హిట్‌తో బాలయ్య మళ్లీ తిరుగులేని శక్తిగా నిలిచారు. తరువాత కూడా కొన్ని సినిమాలు ప్లాప్ అయినా ఆ తర్వాత లెజెండ్, జైసింహా, పైసా వసూల్ వంటి విజయాలు ఆయన పోరాటాన్ని నిలబెట్టాయి. కానీ ఆరు ఏళ్ల క్రితం వరుసగా వచ్చిన యన్.టి.ఆర్: కథానాయకుడు, యన్.టి.ఆర్: మహానాయకుడు, రూలర్ సినిమాలు అంచనాలు అందుకోలేదు. తర్వాత బాలయ్యకు హిట్ రాదన్న చర్చలు మళ్లీ తెరమీదకు వచ్చాయి.
ఆ అంచనాలు పటాపంచలు చేస్తూ అఖండతో బాలయ్య బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేశారు. ఆ విజయం ఆయన కెరీర్‌ను పూర్తిగా మళ్లీ మార్చేసింది. ఆ తర్వాత వచ్చిన వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ వరుస విజయాలతో ఆయన మరోసారి టాప్ ఫామ్‌ను అందుకున్నారు. ఈ పీక్ ఫేజ్‌లో అఖండ 2 అనౌన్స్ కావడంతో అభిమానుల్లో ఉత్సాహం లెక్కించడం కష్టమైంది. భారీ బడ్జెట్, భారీ బిజినెస్, దేశవ్యాప్తంగా ఏర్పడిన హైప్ ఇవన్నీ బాలయ్య కెరీర్‌లో కొత్త స్థాయి గుర్తింపును తీసుకొచ్చాయి. అమెరికా నుంచి భారతదేశం వరకు థియేటర్లు, ఫ్యాన్స్ అసోసియేషన్స్ ప్రత్యేక షోలు, భారీ కటౌట్లు అన్నీ సిద్ధం అయ్యాయి.
కానీ రిలీజ్‌కు గంటల ముందు ప్రీమియర్లకు బ్రేక్ పడటం, తరువాత మొత్తం రిలీజ్ ఆగిపోవడం నందమూరి అభిమానులకు ఊహించని షాక్‌గా మారింది. బాలయ్య సినిమాలకు గతంలో విజయాలు - పరాజయాలు ఉన్నా, సినిమా విడుదల కాకుండా ఆగిపోవడం మాత్రం ఆయన కెరీర్‌లో ఇదే మొదటిసారి జరిగింది. ఇది అభిమానులకు మరింత బాధ కలిగించింది. ఫ్యాన్స్ ఆనందం, సెలబ్రేషన్లు అన్నీ ఒక్కసారిగా ఆగిపోయి, “ఎప్పుడు రిలీజ్?” అనే అయోమయం మాత్రమే మిగిలింది. ఇక సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ మాటల తూటాలు కూడా ఫ్యాన్స్‌ను మరింత బాధపెట్టేలా ఉన్నాయి. దీంతో అఖండ 2 ఎప్పుడు రిలీజ్ అవుతుందో స్పష్టత కోసం వేచి చూస్తున్న పరిస్థితి ప్రతి నందమూరి అభిమానికి ఏర్పడింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి