2025 సంవత్సరం తెలుగు సినిమా పరిశ్రమకు ఆశించిన స్థాయిలో విజయాలను అందించలేకపోయింది. భారీ అంచనాలతో విడుదలైన ఎన్నో పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా నిరాశపరిచాయి. స్టార్ హీరోలు నటించిన సినిమాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడం ఈ ఏడాది ప్రత్యేకంగా కనిపించిన అంశం. కంటెంట్ కంటే హైప్, అంచనాలే ఎక్కువగా ఉండటంతో చాలాచోట్ల నిర్మాతలకు భారీ నష్టాలు తప్పలేదు.ఈ ఏడాది అత్యంత భారీ అంచనాలతో విడుదలైన సినిమాలుగా రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’, పవన్ కళ్యాణ్ నటించిన ‘హరి హర వీర మల్లు’, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘వార్ 2’ నిలిచాయి. అయితే ఈ మూడు సినిమాలు అభిమానుల ఆశలను పూర్తిగా తీరుస్తూ నిలవలేకపోయాయి. కథ, కథనంలో లోపాలు, అంచనాలకు తగ్గ కంటెంట్ లేకపోవడం వల్ల ఇవి బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద పరాజయాలుగా నమోదయ్యాయి. అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. భారీ బడ్జెట్లు పెట్టిన నిర్మాతలకు నష్టాలు తప్పలేదు.


కొన్ని సినిమాలు మాత్రం కొన్ని ప్రాంతాల్లో కొద్దిరోజుల పాటు మెప్పించినప్పటికీ, అన్ని ప్రాంతాల్లో ఒకేలా విజయం సాధించలేకపోయాయి. థియేటర్లను కోర్టుల వరకు తీసుకెళ్లే స్థాయిలో కలెక్షన్లు రాబట్టిన సినిమాలు మాత్రం ఈ ఏడాది వేళ్లపై లెక్క పెట్టేంత తక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాల కంటే చిన్న సినిమాలే పెద్ద విజయాలను నమోదు చేయడం ఈ ఏడాది ప్రత్యేకతగా నిలిచింది.కంటెంట్ బలంగా ఉంటే సినిమా చిన్నదైనా పెద్ద హిట్ అవుతుందనడానికి ఈ ఏడాది వచ్చిన కొన్ని సినిమాలు బెస్ట్ ఎగ్జాంపుల్స్‌గా నిలిచాయి. ప్రేక్షకులను నిజంగా అలరించిన సినిమాల్లో ‘8 వసంతాలు’, ‘కోర్ట్’, ‘లిటిల్ హార్ట్స్’, ‘ది గర్ల్‌ఫ్రెండ్’, ‘రాజు వెడ్స్ రాంబాయి’ వంటి చిత్రాలు ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ప్రతి సినిమా ఒక ప్రత్యేకమైన సందేశాన్ని, సమాజానికి అవసరమైన అంశాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది.



అందులో ముఖ్యంగా ‘కోర్ట్’ సినిమా ప్రేక్షకులను ఆలోచింపజేసింది. 18 సంవత్సరాలు నిండకముందే ప్రేమలో పడితే ఎదురయ్యే సమస్యలు, పోక్సో చట్టం ఎంత ప్రమాదకరం, దాన్ని దుర్వినియోగం చేస్తే వ్యక్తుల జీవితాలు ఎలా నాశనం అవుతాయనే అంశాలను ఈ సినిమా బలంగా చూపించింది. హర్ష్ రోషన్, శ్రీదేవి ఆపాల ప్రధాన పాత్రల్లో నటించగా, ప్రియదర్శి, శివాజీ, సాయికుమార్ కీలక పాత్రలు పోషించారు. నాని నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో భారీ హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా కోర్టు సీన్లు ప్రేక్షకులను కట్టిపడేశాయి. వాస్తవికతతో కూడిన కథనం సినిమాకు ప్రధాన బలంగా మారింది.



ఇక ‘లిటిల్ హార్ట్స్’ విషయానికి వస్తే, మొదట ఈ సినిమా నేరుగా ఓటీటీలో విడుదల కావాల్సి ఉండగా, థియేటర్లలో రిలీజ్ చేసి నిర్మాతలు పెద్ద రిస్క్ తీసుకున్నారు. అయితే ఆ రిస్క్ భారీ సక్సెస్‌గా మారింది. యూట్యూబ్ ఫేమ్ మౌళి, తనుజ్ ప్రశాంత్ హీరోలుగా నటించగా, శివాని నగరం హీరోయిన్‌గా కనిపించింది. డైరెక్టర్ సాయి మార్తాండ్‌కు ఈ సినిమా కెరీర్‌లో కీలక మలుపు తిప్పింది. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ రూ.40 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించడం విశేషం.



అలాగే రష్మిక నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ కూడా ఊహించని విధంగా ప్రేక్షకుల ఆదరణ పొందింది. ప్రేమ పేరుతో అమ్మాయిని బానిసలా చూడడం, ఏ తప్పు జరిగినా ఆమెనే బాధ్యురాలిగా చేయడం వంటి పరిస్థితులకు ఎదురొడ్డి నిలిచే ఒక యువతీ కథే ఈ సినిమా. ఇది నిజ జీవితానికి దగ్గరగా ఉండటంతో ముఖ్యంగా అమ్మాయిలకు బాగా కనెక్ట్ అయ్యింది. మహిళా సాధికారత, స్వాభిమానాన్ని బలంగా చూపించిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది.ఇక ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఈ ఏడాది వచ్చిన సూపర్ సర్‌ప్రైజ్ హిట్లలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాలో హీరోయిన్ తండ్రి పాత్రలో నటించిన వ్యక్తి, డీజే టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డకు బ్రదర్ అని తెలిసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. వినోదంతో పాటు భావోద్వేగాలను మేళవించిన కథనం ఈ సినిమాకు ప్రధాన బలంగా మారింది.

మొత్తానికి 2025 తెలుగు సినిమా సంవత్సరాన్ని గమనిస్తే, స్టార్ పవర్ కంటే కంటెంట్‌కే ప్రేక్షకులు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనే విషయం మరోసారి రుజువైంది. భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు విఫలమైతే, చిన్న సినిమాలు పెద్ద సందేశాలతో పాటు బిగ్ హిట్లుగా నిలిచాయి. మంచి కథ, బలమైన స్క్రీన్‌ప్లే, నిజాయితీగా చెప్పిన సందేశం ఉంటే సినిమా ఎంత చిన్నదైనా విజయాన్ని సాధించగలదనేందుకు ఈ ఏడాది వచ్చిన సినిమాలు నిలువెత్తు ఉదాహరణలుగా నిలిచాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: