సంక్రాంతి అంటే తెలుగు వారికి పండుగల పండుగ. పిండి వంటల సువాసన, రంగురంగుల ముగ్గులు, కొత్త బట్టల సందడి, హరిదాసుల కీర్తనలు, కోడిపందాలు… ఇవన్నీ ఎంత ముఖ్యమో, అంతే ముఖ్యంగా సంక్రాంతి బాక్సాఫీస్ రేస్ కూడా ఉంటుంది. ప్రతి ఏడాది ఈ పండుగకు టాప్ హీరోల సినిమాలు పోటీపడి విడుదలవుతుంటాయి. నిర్మాతలు, దర్శకులు సంక్రాంతినే టార్గెట్‌గా పెట్టుకుని భారీ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారు.అయితే ఈ సంప్రదాయంలో 2004 సంవత్సరం మాత్రం నిజంగా వెరీ వెరీ స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే ఆ ఏడాది సంక్రాంతికి ఒకేసారి బాలకృష్ణ, ప్రభాస్, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సినిమాలు థియేటర్లలో పోటాపోటీగా విడుదలయ్యాయి. ఆ సినిమాలు ఎలా నిలిచాయి? ఏ సినిమా ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంది? బాక్సాఫీస్ వద్ద ఏ సినిమా పేలిపోయింది? ఇప్పుడు ఆ విశేషాలను చూద్దాం.

బాలకృష్ణ – లక్ష్మీనరసింహ:

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లక్ష్మీనరసింహ సినిమా జనవరి 14, 2004న సంక్రాంతి కానుకగా విడుదలైంది. ఈ సినిమాలో బాలయ్య పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో మెరిశారు. బాలకృష్ణ స్టైల్, డైలాగ్ డెలివరీ, పవర్‌ఫుల్ యాక్షన్ సీన్స్‌తో పాటు ఆయన డాన్స్ పెర్ఫార్మెన్స్ సినిమాకు భారీ ప్లస్ అయ్యాయి. ప్రకాష్ రాజ్ నటన కూడా కథకు బలంగా నిలిచింది. ఈ సినిమా అభిమానులను బాగా అలరించడమే కాకుండా, సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. అంతేకాదు, బాలకృష్ణ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్గా రికార్డు సృష్టించింది.

ప్రభాస్ – వర్షం:

ఇదే సంక్రాంతి రేసులో మరో సంచలన చిత్రం ప్రభాస్ నటించిన వర్షం. ఈ సినిమా కూడా జనవరి 14, 2004న విడుదలైంది. ప్రభాస్ హీరోగా, త్రిష హీరోయిన్‌గా నటించిన ఈ లవ్ అండ్ యాక్షన్ డ్రామా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది.అప్పటికే బాలకృష్ణ లాంటి స్టార్ హీరో సినిమా థియేటర్లలో ఉన్నప్పటికీ, అప్పుడప్పుడే హీరోగా ఎదుగుతున్న ప్రభాస్‌కు వర్షం సినిమా భారీ బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. నిజం చెప్పాలంటే, ఆ సమయంలో లక్ష్మీనరసింహ కంటే కూడా వర్షం సినిమాకు కొంచెం ఎక్కువ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది అని చెప్పుకోవచ్చు.వర్షం సినిమా ప్రభాస్ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్గా మారింది. ఈ సినిమా కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్గా నిలిచి, ప్రభాస్‌ను స్టార్ హీరోల జాబితాలోకి తీసుకెళ్లింది.

చిరంజీవి – అంజి:

మెగాస్టార్ చిరంజీవి నటించిన అంజి సినిమా జనవరి 15, 2004న విడుదలైంది. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాలో చిరంజీవి హీరోగా, నమ్రత శిరోద్కర్ హీరోయిన్‌గా నటించారు. అప్పట్లో ఇది భారతదేశంలోనే అత్యధిక విజువల్ ఎఫెక్ట్స్‌తో తెరకెక్కిన సినిమాల్లో ఒకటిగా ప్రచారం పొందింది.అయితే, సినిమాపై పెట్టిన భారీ అంచనాలకు తగ్గ ఫలితం మాత్రం రాలేదు. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ క్వాలిటీపై విమర్శలు వచ్చాయి. ఓవర్ హైప్ ఇచ్చారంటూ కొందరు ట్రోల్ కూడా చేశారు. చిరంజీవి నటన బాగున్నప్పటికీ, సినిమా మొత్తం స్థాయిలో ఆశించినంత విజయం సాధించలేకపోయింది.

జూనియర్ ఎన్టీఆర్ – ఆంధ్రావాలా:

సంక్రాంతి సీజన్‌లోనే జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆంధ్రావాలా కూడా విడుదలైంది. ఈ సినిమా జనవరి 1, 2004న థియేటర్లలోకి వచ్చింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ మాస్ లుక్‌లో కనిపించారు.కానీ దురదృష్టవశాత్తు, సినిమా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్గా నిలిచింది. అయితే, ఈ సినిమా గురించి ఇప్పటికీ మాట్లాడుకునే అంశం ఒక్కటే — ఆంధ్రావాలా ఆడియో ఫంక్షన్. ఆ ఫంక్షన్ అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయింది. అంత స్థాయిలో ఆడియో ఫంక్షన్ క్రేజ్ అప్పటివరకు ఏ సినిమాకీ రాలేదని చెప్పాలి.

మొత్తంగా చూస్తే, 2004 సంక్రాంతి టాలీవుడ్ చరిత్రలో ఒక గుర్తుండిపోయే సీజన్. బాలకృష్ణ – లక్ష్మీనరసింహతో భారీ బ్లాక్‌బస్టర్, ప్రభాస్ – వర్షంతో స్టార్ హీరోగా ఎదుగుదల, చిరంజీవి – అంజితో ప్రయోగాత్మక ప్రయత్నం, జూనియర్ ఎన్టీఆర్ – ఆంధ్రావాలాతో విభిన్న అనుభవం… ఇలా ప్రతి హీరోకు ఈ సంక్రాంతి ప్రత్యేక జ్ఞాపకాలను మిగిల్చింది.అందుకే 2004 సంక్రాంతి అంటే కేవలం పండుగ మాత్రమే కాదు… టాలీవుడ్ బాక్సాఫీస్‌లో ఒక చారిత్రక అధ్యాయం అని చెప్పుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: