భారత్ లో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. దేశంలో నిన్న ఒక్కరోజే దాదాపు 50,000 కేసులు నమోదు కావడం వైరస్ తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో నమోదవుతున్న కేసులు ప్రజల్లో భయాందోళనను అంతకంతకూ పెంచుతున్నాయి. ప్రజలు మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటిస్తే మాత్రమే వైరస్ భారీన పడకుండా తమను తాము రక్షించుకోవచ్చు. వేగంగా వ్యాప్తి చెందుతున్న వైరస్ వల్ల పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 
 
వైరస్ తీవ్ర‌త అధికంగా ఉన్న నేప‌థ్యంలో దేశీయ విమానాలపై ఆంక్షలను నవంబర్ 24 వరకు పొడిగించింది. నిన్న సాయంత్రం ఈ మేరకు నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ లో దేశీయ విమాన ఛార్జీలపై గ‌తంలో విధించిన నియంత్ర‌ణ కొన‌సాగుతుంద‌ని పౌర విమానయాన శాఖ స్ప‌ష్టం చేసింది. వ్యాధి వ్యాప్తిని నివారించడానికి ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడంతో మార్చి 25వ తేదీ నుంచి దేశీయ విమాన సర్వీసులు నిలిచిపోయాయి. 
 
మే 25వ తేది నుంచి కేంద్రం దేశవ్యాప్తంగా పరిమిత సంఖ్యలో దేశీయ విమాన సర్వీసులకు అనుమతిచ్చింది. వైరస్ విజృంభణ తగ్గితే పూర్తిస్థాయిలో అనుమతులు ఇవ్వాలని భావించినా రోజురోజుకు కేసులు పెరుగుతుండటంతో విమాన ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. దేశీయ విమానయాన పరిశ్రమ వివిధ రంగాలకు ఛార్జీల పరిమితితో, పరిమిత సామర్థ్యంతో పనిచేస్తున్నందున ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటోంది. 
 
మరోవైపు కేంద్ర, వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన లెక్కల ప్రకారం భారత్ లో నిన్న ఒక్కరోజే అత్యధికంగా 49,310 కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటివరకు నమోదైన కేసుల్లో ఇవే అత్యధికం. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 12,87,945కు చేరగా 30,601 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 4,40,135 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ కరోనా రికవరీ రేటు పెరుగుతుండటం, మరణాల రేటు తగ్గుతుండటం గమనార్హం. 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: