దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా మహారాష్ట్రలో క్రమక్రమంగా అన్ని ప్రాంతాల్లో ఆంక్షలు అమలవుతున్నాయి. కొన్నిచోట్ల లాక్ డౌన్ మినహా వేరే ప్రత్యామ్నాయం కనపడటంలేదు. ఇటు ఏపీలో కూడా రోజు రోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ముంఖ్యంగా ఏపీలోని గుంటూరు జిల్లాలో ఒకేరోజు 48 కొత్త కేసులు నమోదవడం ఆందోళన కలిగించే అంశం.

కరోనా కట్టడిలో ఏపీ ముందంజలో ఉంది. ఓ దశలో కేసుల సంఖ్య పెరిగినా.. జాతీయ సగటుతో పోల్చి చూస్తే ఏపీలో మరణాల సంఖ్య చాలా తక్కువ. అందుకే ఏపీలో రికవరీ రేటు పెరిగింది. పొరుగు రాష్ట్రాల్లో మరణాల సంఖ్య ఎక్కువగా ఉన్నా.. ఏపీలో మాత్రం కరోనా వల్ల జరిగిన ప్రాణ నష్టం తక్కువే. అందుకే ఇతర రాష్ట్రాన్నిటికంటే ముందుగానే ఏపీలో ఆంక్షలు సడలించుకుంటూ పోయారు. ఇతర రాష్ట్రాలకంటే ముందుగానే స్కూల్స్ తెలిచారు, కాలేజీలు, ఎగ్జామ్స్.. హడావిడి అంతా మొదలైంది. తీరా ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఏపీలో కూడా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. దాదాపుగా 13 జిల్లాల్లో కూడా గతంలో కంటే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి.

గుంటూరు జిల్లాలో మాత్రం కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది.  కరోనా కలకలం రేపుతోంది. జిల్లాలో చానాళ్లుగా 10 లోపు కేసులే నమోదవుతుండగా, ఆదివారం ఒకే రోజు 48 కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. పొన్నూరు పట్టణంలోని ఓ ప్రయివేటు పాఠశాలలో 8 మంది విద్యార్థులకు పాజిటివ్‌ వచ్చినట్టు తహశీల్దార్ స్పష్టం చేశారు. వారితో పాటు పట్టణంలోని మరో ముగ్గురికి పాజిటివ్‌ వచ్చినట్టు తెలిపారు. స్కూల్ పిల్లల్ని, వారి తల్లిదండ్రుల్ని హోమ్ క్వారంటైన్ లో ఉంచామని చెప్పారాయన. మిగతా పిల్లల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నామని, స్కూల్ ని తాత్కాలికంగా మూసివేసి శానిటైజ్ చేయిస్తున్నామని అన్నారు. అటు తెనాలి మున్సిపాల్టీలో కూడా ఆరుగురు ఉద్యోగులు కొవిడ్ బారిన పడటం ఆందోళన కలిగించే అంశం. మున్సిపల్ కార్యాలయ మేనేజర్, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు, కంప్యూటర్‌ ఆపరేటర్లకు పాజిటివ్‌ గా నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది. ఈ నెల 10న మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్ విధుల్లో వీరు పాల్గొన్నారు కూడా. దీంతో వారితోపాటు ఎన్నికల డ్యూటీలకు వచ్చినవారి వివరాలు సేకరించే పనిలో పడ్డారు అధికారులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: