బైక్‌ పై అడ్డగోలుగా వెళ్తే ఏమవుతుంది.. ట్రాఫిక్‌ పోలీసులు చూస్తే ఇబ్బంది.. ఎవరూ చూడకపోతే ఏమవుతుందిలే అనుకోవడానికి వీలు లేదు. ఎక్కడికక్కడ మొబైల్ ట్రాఫిక్‌ పోలీసులు నిఘా వేస్తుంటారు. హైదరాబాద్ అంతటా నిఘా కెమేరాలు ఉన్నాయి. ఎక్కడ ఫోటోలో దొరికిపోయినా సరే.. చలాన్‌ వేసేస్తారు. అయితే ఈ చలాన్లు ఉన్న సంగతే చాలా మందికి తెలియదు. ఆ.. మనల్ని ఎవరూ చూడలేదులే అనుకుని తప్పించుకున్నామని సంబరపడతారు.


హైదరాబాద్‌ కు చెందిన ఓ వాహనదారుడు అలాగే ఫీలయ్యే వాడు. ఆ వాహన దారుడికి హెల్మెట్‌ పెట్టుకోవడం అస్సలు ఇష్టం లేదనుకుంటా.. అలా చాలా సార్లు ట్రాఫిక్ కెమేరాలకు చిక్కాడు. అయితే మనోడికి ట్రాఫిక్ చలాన్లు ఉంటాయని తెలియదేమో.. 2018 నుంచి తన వాహనంపై చలాన్లు నమోదవుతున్నా పట్టించుకోలేదు. అలా క్రమంగా ఆ చలాన్ల సంఖ్య ఏకంగా 130కు చేరింది. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించి 130 చలాన్లు ఉన్న ఓ ద్విచక్ర వాహనదారుపై జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు ఏకంగా కేసు నమోదు చేశారు.


జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టులో తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ మహానుభావుడు దొరికిపోయాడు. వెంకటగిరి వైపు నుంచి జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 2 వైపు వస్తున్నప్పుడు ఆపి చెక్ చేశారు. టీఎస్‌10 ఈఆర్‌ 7069 నెంబరున్న ఈ వాహనం చలాన్లు చెక్ చేశారు. 2018 నుంచి ఇప్పటివరకు 130 చలాన్లు అతని వాహనంపై  ఉన్నాయి. వీటిలో ఎక్కువగా హెల్మెట్‌ పెట్టుకోకపోవడం గురించే ఉన్నాయి. కొన్నిసార్లు అతి వేగం, రాంగ్‌ పార్కింగ్‌, వంటి ఉల్లంఘనలు కూడా ఉన్నాయి.


ఈ చలాన్ల లిస్టు చూసిన ట్రాఫిక్ పోలీసులు అతని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. చలాన్ల మొత్తం ఎంతయ్యిందో తెలుసా.. రూ.35,950 రూపాయలు. ఆ మొత్తం చెల్లించాలని పోలీసులు అడిగితే.. అంత సొమ్ము తన వద్ద లేదని చెప్పాడు. దీంతో పోలీసులు అతని హోండా యాక్టివాను స్వాధీనం చేసుకొన్నారు. వాహనదారు విజయ్ మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో ఉద్యోగిగా తెలుస్తోంది. ఎందుకైనా మంచిది మీరు కూడా మీ వాహనం చలాన్లు చెక్ చేసుకోండి.


మరింత సమాచారం తెలుసుకోండి: