కరోనా టీకా వేయించుకునే వారి సంఖ్య పెంచేందుకు బ్రిటన్ ప్రభుత్వం కొత్త ఆఫర్స్ ప్రకటిస్తోంది. అందుకోసం వ్యాక్సిన్ వోచర్స్ అనే స్కీమ్ తీసుకొచ్చింది. ఇందులో భాగంగా పిజ్జా డిస్కౌంట్ లు, షాపింగ్ వోచర్స్, ప్రయాణ రాయితీలు అందించనుంది. ఈ పథకంలో బోల్ట్, ఉబెర్, డెలివెరూ, పిజ్జా పిలిగ్రిమ్స్ సంస్థలు భాగస్వాములయ్యాయి. అయితే వ్యాక్సినేషన్ పెంచేందుకు ఈ ఆఫర్ ఉపయోగపడుతుందని బ్రిటన్ అధికారులు భావిస్తున్నారు.

ఇక అమెరికా ప్రభుత్వం అయితే యువత వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహించేందుకు సరికొత్త ఆఫర్లు ప్రకటించింది. టీకా తీసుకున్న వారికి బీర్, డోనట్ ఉచితంగా ఇస్తూ వస్తోంది. అంతేకాదు పొదుపు బాండ్లను సైతం వారికి ఇస్తూ వ్యాక్సిన్ విషయంలో ఎంకరేజ్ చేస్తోంది. ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ ఆఫర్లను ప్రజలకు అందించేందుకు పలు వ్యాపార సముదాయాలు సైతం ముందుకు రావడం విశేషం.

మరోవైపు ఇజ్రాయేల్ దేశం సైతం వ్యాక్సిన్ విషయంలో ప్రజలకు ఆఫర్లు ప్రకటించింది. ఆ దేశంలో ఉండే 90లక్షల మంది జనాభా శ్రేయస్సే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇప్పటి వరకు దాదాపు 50శాతం వరకు టీకా ఇవ్వగా.. మిగిలిన వారిని టీకా తీసుకునేందుకు ప్రోత్సహించేందుకు ప్రణాళికలు రూపొందించింది. అంతేకాదు వాటిని పక్కాగా అమలు చేసేందుకు కసరత్తులు చేస్తోంది. వ్యాక్సిన్ వేయించుకుంటే.. డ్రింగ్స్ ఉచితమంటూ ఆఫర్ ఇస్తోంది. ఈ ఆఫర్లకు టెంప్ట్ అవుతున్న అక్కడి ప్రజలు టీకా తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

ప్రజలను మహమ్మారి బారి నుండి తప్పించేందుకు ఆయా దేశాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. వ్యాక్సిన్ పై మొగ్గు చూపని వారిని ఎలాగైనా దారిలోకి తీసుకొచ్చేందుకు.. ఇలాంటి ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఆ ఆఫర్లకు ముగ్దులైన వారు వెంటనే వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. వైరస్ ప్రభావం నుండి దూరం జరుగుతున్నారు. దీంతో ఆయా దేశాలు వ్యాక్సినేషన్ విషయంలో సక్సెస్ సాధిస్తున్నాయి.మొత్తానికి వివిధ దేశాలు వ్యాక్సినేషన్ వేగవంతం చేసేందుకు వేసిన ప్లాన్ లు బాగున్నాయి కదూ..!

 








మరింత సమాచారం తెలుసుకోండి: