ప్రపంచంలో పన్ను చెల్లించకుండా ఎగవేస్తున్న వారి సంఖ్య రానురాను పెరిగిపోతుంది. దీనివలన ఆయా ప్రభుత్వాల ఆదాయం కూడా తగ్గిపోతుంది. అందుకే ఇప్పటికే ఆర్థిక వేత్తలు పన్ను చెల్లింపు నిబంధనలను మరింత కఠినతరం చేయాలని సూచిస్తున్నారు. అయితే ప్రపంచంలో పన్ను ఎగొట్టే వాళ్లందరికి లండన్ గమ్యస్థానం అవుతుందని ఆయా నిపుణులు పేర్కొన్నారు. పన్ను మినహాయింపులలో ఉన్న లోపాలను సంపన్నులు ఇష్టారాజ్యంగా వాడుకుంటూ ఉండటం వలన అసలు సమస్య తలెత్తుతుందని వారు అంటున్నారు. ఈ లోపాలతో సంపన్నులు అక్రమంగా డబ్బు దాచుకోవడానికి ముందు వరసలో ఉంటున్నారు. కేవలం దీనివలననే మనీలాండరింగ్, పన్ను ఎగవేత లాంటివాటికి పన్ను నిబంధనలు బ్రిటన్ మరింత కఠినతరం చేయాలని ఇప్పటికే పలు వర్గాల నుండి అనేక డిమాండ్స్ కూడా అందుతున్నాయి.

ఇప్పటికే లండన్ ఆఫ్ షోర్ ఖాతాలు కలిగి ఉన్నవారిలో పాక్ ప్రధాని సహా జోర్డాన్ రాజు కింగ్ అబ్దుల్లా2, అజర్ బైజాన్ అధ్యక్షుడు ఇల్ హాం అలియెవ్ తదితరులకు ఉన్నట్టు ప్రాంతీయ  పత్రిక ప్రకటించిన విషయం తెలిసిందే. ఇవన్నీ అక్కడి ప్రభుత్వం ప్రకారం చట్టబద్దమైనవే అయినప్పటికీ వీటిని ఆసరాగా చేసుకొని పలువురు పన్ను ఎగవేతలకు పాల్పడుతున్నారు. ఇంత సాంకేతికత, విస్తృత అవకాశాలు ఉన్న లండన్ లో ఇలాంటి విషయాలు చోటుచేసుకోవడం మంచిది కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బ్రిటన్ చట్టాల లో లోపాలు ప్రపంచదేశాల లో ఉన్న వారికి అనుకూలంగా ఉండటంతో వాళ్ళు  నల్లధనాన్ని  ఈ దేశంలో దాచుకుంటున్నారు. ఇటీవల జరిగిన సర్వే ప్రకారం ఇంగ్లాండ్, వేల్స్ లోని 87 వేల ఆస్తులు, పన్నులు తక్కువగా ఉన్న దేశాలలో నమోదైన అనామక సంస్థలకు చెందినవని తేలింది.

ఇందులో 40 శాతం సంస్థలు కేవలం లండన్ లోనే ఉన్నాయి. వీటి విలువ 135 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువగానే ఉంది. ఇవన్నీ బ్రిటన్ పార్లమెంట్ కు అతిసమీపంలోనే ఉన్నాయి. లండన్ నడిబొడ్డులో ఉన్న అనేక ఆస్తులు విదేశీయులవి కావడం శోచనీయమని నిపుణులు అంటున్నారు. ఎప్పుడో విదేశీ సంస్థల పెట్టుబడులను ఆకర్షించడానికి తెచ్చిన పన్ను మినహాయింపు ఇప్పుడు దారితప్పి నల్లధనం తయారీకి ఉపయోగపడుతుంది. ఆయా దేశాలలో మనీలాండరింగ్ లాంటి ఆర్థిక నేరాలకు ప్రాణం పోస్తుందని వారు అన్నారు. ఇప్పటికే ఎన్నో సంస్థలకు అసలు యజమానులు కూడా తెలియని స్థితిలో ఉన్నాయని, అవన్నీ ఎంతో విలువైనవని, వాటి యజమానులు పేర్లు బహిర్గతం చేయకపోతే వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని వారు సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: