ఎప్పుడు ఏ వస్తువుకు ఎందుకు డిమాండ్ ఏర్పడుతుందో ఈ మధ్యన అస్సలు అర్ధం కావడం లేదు. హుజూరాబాద్ ఉప ఎన్నికల పుణ్యమా అని అక్కడ చికెన్ షాపులకు ఫుల్ గిరాకీ ఏర్పడింది. అయినా.. ఉపఎన్నికలకు చికెన్ షాపులకు సంభంధం ఏమిటని ఆశ్చర్యపోకండి.. అక్కడికే వస్తున్నాం. ఉపఎన్నికల సందర్భంగా గత రెండు నెలలుగా ఇక్కడ నాయకులు.. కార్యకర్తలతో ప్రతీ రోజూ సమావేశాలు పెడుతున్నారు. ఈ సమావేశాల సందర్భంగా చాలామందికి స్థానికంగానే వసతి కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో నగరంలోని లాడ్జీలన్నీ ఇప్పటికే హౌస్ ఫుల్ అయిపోయాయి. ఇలా ఇతర జిల్లాల నాయకులతో హుజురాబాద్ ఇప్పుడు కిటకిటలాడుతోంది.

ఇలా నగరంలో మకాం వేసిన ఇతర జిల్లాల నాయకులు, సొంత మనుషులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా స్థానిక నాయకులదే.. ప్రచార బాధ్యతలు కూడా వారివే కావడంతో కార్యకర్తలను కంటికిరెప్పలా చూసుకుంటున్నారు. ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చిన నాయకులు, వారి అనుచరగణంతో కూడా హుజూరాబాద్ నిండిపోతోంది. దీంతో వారికి ప్రతీరోజూ చికెన్ బిర్యానీలు తినిపిస్తూ, రాత్రికి మందు పార్టీలు కూడా తప్పనిసరి చేస్తున్నారు. ఇలా ఒక్కసారిగా చికెన్ కు డిమాండ్ ఏర్పడింది. ఈ కారణంగా నగరంలో ఇప్పటికే ఉన్న అన్ని చికెన్ స్టాళ్లలో సేల్స్ విపరీతంగా పెరిగాయి.

ఒక్క చికెన్ మాత్రమే కాదు.. కరోనా వాక్సినేషన్ కు కూడా ఉన్నట్టుండి అకస్మాత్తుగా డిమాండ్ పెరిగిపోయింది. ఎందుకంటే ప్రచారంలో పాల్గొనాలన్నా, రేపు పోలింగ్ ఏజెంట్లుగా, కౌంటింగ్ ఏజెంట్లుగా ఉండాలన్నా.. ప్రతీఒక్కరికి రెండు డోసుల వాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి. ఇప్పటివరకూ వివిధ కారణాలతో వాక్సిన్ వేయించుకోకుండా తిరుగుతున్న వారంతా ఇప్పుడు వాక్సిన్ కోసం క్యూ కడుతున్నారు. తమ నాయకుల దగ్గర నుంచి వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఫోన్లు చేయించుకొని మరీ వాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ లు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఉప ఎన్నికల కారణంగా హుజూరాబాద్ లో మాంసానికి, మద్యానికి, పనిలో పనిగా.. టీకాలకు కూడా డిమాండ్ పెరగడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: