L హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా ఫోకస్ పెట్టింది. ఒకవైపు పార్టీలోని రెబల్ అభ్యర్థులను బుజ్జగిస్తూనే మరోవైపు ప్రత్యర్థుల బలహీనతల పై దృష్టి పెట్టింది. ప్రధానంగా యూత్,నిరుద్యోగ ఓటర్లను నమ్ముకొని హస్తం పార్టీ నేతలు పనిచేయనున్నారు. అనూహ్యంగా ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ బల్మూర్ వెంకట్ ను బరిలోకి దింపింది. అయితే టికెట్ కోసం చివరి వరకు ఆశించిన నేతలు కొందరు రెబల్ గా నామినేషన్ వేశారు.

మరి కొందరు పార్టీ తీరుపై కోపంతో అలక పాన్పు ఎక్కారు. దీంతో పిసిసి వారిని బుజ్జగించే పనిలో ఉంది. రెబల్గా నామినేషన్ వేసిన వారిని విత్ డ్రా చేసుకునేలా బతిమిలాడుతున్నారు. వెంకట్ అభ్యర్థిత్వంపై కోపంగా ఉన్న వారికి హామీలిచ్చే పనిలో  ఉన్నారు. ఇప్పటికే టికెట్ ఆశించి భగ్నపడ్డ నేతలలో దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్ లు గాంధీ భవన్ లో భేటీ అయ్యారు. కాంగ్రెస్ నుంచి 19 మంది టికెట్ కోసం  ఆశించారు. నిరాశకు గురైన వీరిని భవిష్యత్తులో పార్టీ అవకాశం ఇస్తుందని హామీ ఇచ్చారు. వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ హుజురాబాద్ నేతలతో మరోసారి భేటీ అయ్యారు. ఇప్పటికే హుజురాబాద్ లో టిఆర్ఎస్, బిజెపిలు ప్రచారంలో ముందున్నాయి. అయితే రెండు పార్టీలు ఒక్కటే అన్న నినాదంతో ప్రచారం చేయనుంది కాంగ్రెస్ . ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్ తో పాటు, కరీంనగర్ జిల్లా నేతలతోపాటు దామోదర రాజనర్సింహ ప్రచారం చేస్తున్నారు. దసరా పండుగ తర్వాత సీనియర్లంతా హుజరాబాద్ లో మకాం వేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే విద్యార్థి,నిరుద్యోగుల సమస్యలపై జంగ్ సైరన్ మోగిస్తోంది కాంగ్రెస్.

హైదరాబాద్ ఉప ఎన్నికల్లో యువత, నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీని ఆదరించే అవకాశం ఉందని భావిస్తున్నారు లీడర్లు. ఇప్పుడు సర్కార్ పై ఉన్న వ్యతిరేకత,యూత్ ఓట్లు, నిరుద్యోగుల ఓట్లు కలిస్తే ఉప ఎన్నికల్లో గెలుపు ఖాయమని ధీమాతో ఉన్నారు హస్తం నేతలు.

మరింత సమాచారం తెలుసుకోండి: