బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అనుకున్నంత పని చేసింది. తీర ప్రాంతాలను వణికించి అల్లకల్లోలం చేసింది. వాయుగుండంలా మారి చిత్తూరు జిల్లాను కమ్మేసింది. ఇప్పటికే ఈ వాయుగుండం ప్రభావంతో చిత్తూరు జిల్లాలో భారీగా వర్షాలు కురిశాయి. ప్రధానంగా తిరుపతి పట్టణం భారీ వర్షాలకు అతలాకుతలమైంది. వరద పోటెత్తి తిరుపతి నగరాన్ని ముంచేసింది. ఈ ప్రభావంతో చిత్తూరుతో పాటూ, నెల్లూరు, కడప జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిశాయి. తీరం దాటిన అనంతరం అల్పపీడనం అనంతపురం, బెంగుళూరు ప్రాంతాలపైకి వెళ్లింది. తీరం దాటిన తర్వాత కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

అల్పపీడనం వాయుగుండంగా మారిన సమయంలో తిరుపతిలో భారీ వర్షాలు పడ్డాయి. ప్రజలు భయంతో వణికిపోయారు. ఇప్పటికే నగరాన్ని వరద నీరు ముంచెత్తడంతో తీరం దాటే సమయంలో మరింతగా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. గత పాతికేళ్లలో ఇలాంటి భారీ వర్షాలను ఎప్పుడూ చూడలేదని నగరవాసులు చెబుతున్నారు. తిరుపతి పట్టణంలో ఎక్కడ చూసినా, కనీసం మోకాలి లోతుకు తగ్గకుండా వరద నీరు ప్రవహిస్తోంది. ఈ వరద భీబత్సం దృశ్యాలు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి. అటు తిరుమల కూడా ఈ భారీ వర్షాలకు కకావికలం అయింది. కొండపైనుంచి భారీగా వరద నీరు పోటెత్తుతోంది. దీంతో పర్యాటకులను అనుమతించకుండా తిరుమల ఘాట్ రోడ్లు కూడా మూసివేశారు టీటీడీ అధికారులు.

తిరుమల కొండపై వరుణ దేవుడు బీభత్సం సృష్టించాడు. ప్రధాన ఆలయం ఎదుట మాడవీధులన్నీ నదులుగా మారిపోయాయి. క్యూ లైన్లలోకి కూడా వరద నీరు వచ్చి చేరింది. తిరుమలలోని ఆంజనేయుని జన్మస్థానమైన జాపాలి ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణం పూర్తిగా నీట మునిగింది. కొండలపైనుంచి బండరాళ్లు జారిపడుతుండడంతో అధికారులు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా తిరుమలకు వెళ్లేందుకు వీలు లేకుండా అలిపిరి నడక మార్గాన్ని కూడా ఇప్పటికే అధికారులు మూసివేశారు. భారీ వర్షాల కారణంగా వచ్చే వరదలతో చిత్తూరు జిల్లాతో పాటూ ఇప్పుడు అనంతపురం, కడప జిల్లాల్లోనూ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: