మహిళల వివాహ వయసు ను తాజాగా కేంద్రప్రభుత్వం 21కి పెంచిన సంగతి తెలిసిందే. దానిపై ఆయా వర్గాల నుండి భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. గతంలో ఈ వయసు 18ఏళ్లుగా ఉండేది. ఆ వయసుకు పెళ్లి చేయడంతో వెంటనే గర్భందాల్చడం లాంటి ఇబ్బందులు వస్తున్నాయి. చిన్న వయసులో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి, అలాగే ఆ వయసులోనే బాధ్యతలు మీదపడటం వలన కూడా అనేక మానసిక సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో వయసు పెంపు పై అనేక సిఫారసులు అందటంతో కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రతి నిర్ణయంలో ప్రతికూల అంశాలు, అనుకూల అంశాలు కూడా ఉంటాయి. దీనితో ఈ నిర్ణయాన్ని స్వాగతించేవారు ఎలా ఉన్నారో, విభేదించే వారు కూడా లేకపోలేదు.

విభేదించడంలో కూడా రెండు రకాలుగా చెప్పవచ్చు. ఒకటి నేటి స్పీడ్ జనరేషన్ లో పాఠశాల వయసులోనే ప్రేమలు, పెళ్లిళ్లు అంటున్నారు. ఆ వయసులో పిల్లలపట్ల ఆయా ప్రభావాలు పడేట్టుగా సమాజంలో కూడా అనేక విషయాలు ప్రేరేపిస్తూనే ఉన్నాయి. వయసుతో వస్తున్న తెలియని ఉత్సాహంలో వాళ్లకు కూడా ప్రేమ అనేది అవసరం అని, దానివైపు పరుగులు తీస్తున్నారు. అలాంటి వారిలో ఈ వయసు పెంపు నిర్ణయం ప్రతికూలంగా ప్రభావం చూపే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది మానసిక ఒత్తిడికి గురిచేసే సందర్భాలు బాగా పెరిగేదానికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. అవన్నీ అవగాహనా చేసుకోలేని స్థితిలో వాళ్ళు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు మెండుగా తయారవుతాయి. ప్రతి పాఠశాలలో మానసిక వైద్యులను నియమించడం ద్వారా పిల్లలకు ఆయా సమయాలలో సరైన మార్గదర్శనం చేయడంతో ఈ సమస్యను కొంతవరకు అధిగమించవచ్చు.

మరో కోణంలో ఆలోచిస్తే, ఓటు కోసం 18 ఏళ్ళు చాలు అన్నవారు వివాహం కోసం మాత్రం 21 ఎందుకు అని అడిగేవారు కూడా ఎక్కువ అవుతారు. నిజానికి ఈరోజులలో పెళ్లిళ్లు కాస్త లేటుగానే జరిగిపోతున్నాయి. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ 30లు దాటాక మాత్రమే పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు. ఇతర గ్రామాల విషయాలలో లేదా అంతకంటే తక్కువ సామజిక స్పృహ ఉన్న ప్రాంతాలలో లేదా పేదరికం భరించలేని వాళ్ళు ఆడపిల్లలను అమ్ముకునేందుకు లేదా పెళ్లి పేరుతో బాధ్యత తీర్చుకునేందుకు అనధికార పెళ్లిళ్లు ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వీటన్నిటికీ వయసు పని అసలు లేదు. జరిగేవి జరుగుతూనే ఉన్నప్పటికీ, చట్టపరంగా కొన్ని పరిధిలు పెట్టడం ద్వారా ఆయా వయసు ఆడపిల్లలకు రక్షణ కల్పించేందుకు వీలుంటుంది. అదే ప్రయత్నం కేంద్రం చేసింది. వచ్చే రోజులలో ఈ చట్టంపై ఎటువంటి ప్రతికూల అంశాలు లేవనెత్తుతారు అనేది చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: