ఆంధ్రప్రదేశ్‌లో ఓటీఎస్‌ పథకం ప్రారంభానికి రంగం సిద్ధమైంది. ఈ పథకాన్ని మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆర్భాటంగా ప్రారంభించనున్నారు. అయితే ఇప్పటికే ఓటీఎస్‌ ఆచరణలో విఫలమైంది. లబ్ధిదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ పథకం తమకు శాపంగా మారిందని వారు వాపోతున్నారు. ఎప్పుడో నాలుగు దశాబ్దాల కిందట నిర్మించుకున్న ఇళ్లకు ఇప్పుడు డబ్బులు కట్టడం ఏమిటని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఓటీఎస్‌ అమలు ఎంతవరకు సక్సెస్‌ అవుతుందన్నది ప్రశ్నార్థకంగా మారింది.

రాష్ట్రంలో వివిధ పథకాల కింద ఇళ్లు  నిర్మించుకున్న లబ్ధిదారులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలు జమ చేయకుండా కాలయాపన చేస్తున్నారని అధికార యంత్రాంగం నివేదిక ఒకటి రూపొందించింది. ఈ నివేదిక ప్రకారం రాష్ట్రంలో 1983 నుంచి 2011  వరకు ప్రభుత్వం వివిధ పథకాల కింద దాదాపు  50 లక్షల ఇళ్లను నిర్మించింది. వివిధ కేటగిరీల్లో లబ్ధిదారులు 3వేల రూపాయల నుంచి 30వేల రూపాయల వరకు రుణాలు మంజూరు చేసింది. 2011 సంవత్సరంలో ఒక్కో ఇంటి నిర్మాణానికి లక్ష రూపాయలు మంజూరు చేసింది. అందులో 70వేల రూపాయలను రాయితీగా, 30వేల రూపాయలను రుణం పేరిట మంజూరు చేసింది. అయితే 1983 నుంచి లబ్ధిదారులు  నిర్మించుకున్న ఇళ్లపై రుణం ఉందని, వాటిని ప్రభుత్వానికి తిరిగి చెల్లించాలని ఎవరిపైనా అధికారులు ఒత్తిడి తీసుకురాలేదు.

మరోవైపు చాలా మంది తమ స్థలంలో ఇళ్లను  నిర్మించుకుని ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీని ఉపయోగించుకున్నారు. రుణాలు తీసుకోలేదు. పట్టణ గృహ నిర్మాణ పథకం, ఇందిరా ఆవాస్ యోజన, గ్రామీణ  గృహ నిర్మాణ పథకం కింద ఇళ్ల నిర్మాణం జరిగింది. ఈ ఇళ్లపై  ప్రస్తుతం రుణాలు ఉన్నాయని, ప్రభుత్వ నిధులతో నిర్మించుకున్న ఇళ్ల రిజిస్ట్రేషన్ చేసేందుకు జగనన్న సంపూర్ణ గృహ నిర్మాణ హక్కు పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో గృహ నిర్మాణదారులు రూ.10 వేలు, పురపాలక సంఘాల్లో రూ.15వేలు, నగర పాలక సంస్థల్లో రూ. 20వేలు చెల్లిస్తే వారికి వెంటనే రిజిస్ట్రేషన్ చేసి.. పత్రాలు ఇస్తామని ప్రభుత్వం తెలపింది.  దీని వల్ల హక్కు రావడమే కాకుండా వాటిని బ్యాంకులో తాకట్టు పెట్టుకునే అవకాశం కూడా కల్పిస్తామని స్పష్టం చేసింది.

గృహనిర్మాణం కింద లబ్ధిదారులు డబ్బులు చెల్లించకపోతే వారికి ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ కార్యక్రమాలను కట్ చేస్తామని అధికారులు పలు ప్రాంతాలలో అనధికార హెచ్చరికలు జారీ చేశారు. గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు సందేశాలు పంపారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇందులో 40 లక్షల మంది నుంచి పది వేల రూపాయల చొప్పున మొత్తం నాలుగు వేల కోట్ల రూపాయల సేకరణే లక్ష్యంగా ప్రభుత్వం పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఈ పథకంపై లబ్ధిదారుల నుంచి  తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ క్రమంలో ఓటీఎస్‌ పథకం అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: