మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అశ్వరావుపేట లో ఎమ్మెల్సీ తాతా మధు అభినందన సభలో తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. పార్టీ పరువు పోకుండా ఎమ్మెల్సీ ని గెలిపించానన్నారు. ఒక చోట ఉండి మరో చోట కాపురం చేయడం మంచిది కాదని, ఆయన పరోక్షంగా పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే నేతలకు చురకలు అంటించారు. ఈ విషయాన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలన్నారు. భవిష్యత్తులో అందరూ కలిసి పని చేయాలన్నారు.

తాను మంత్రిగా ఉన్నప్పు డు అశ్వరావుపేట అభివృద్ధి విషయంలో ప్రతి గ్రామానికి లింక్ రోడ్లు వేశానని  ఆయన గుర్తు చేసుకున్నారు. భారతదేశంలో పామ్ ఆయిల్ హబ్ గా అశ్వరావుపేట, దమ్మపేట మండలాలు ఉండబోతున్నాయని అన్నారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో జరిగిన  అభివృద్ధి ఎక్కడా జరగలేదన్నారు. తనను ఈ స్థాయి కి తీసుకు వచ్చిన అశ్వారావుపేట, సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు జీవితాంతం  రుణపడి ఉంటానని చెప్పారు. ఇక తన గెలుపు ఉగాది పచ్చడిలా ఉందని ఎమ్మెల్సీ తాతా మధు చెప్పారు. తన గెలుపులో తీపి,చేదు చేసింది ఎవరో మీకు తెలుసు అన్నారు. ఇప్పుడు జరిగిన తప్పే 2018 ఎన్నికల్లో జరిగిందని తాత మధు చెప్పారు. మన పార్టీలో కొంతమంది వల్ల  2018లో ఎమ్మెల్యేలు ఓడిపోయారన్నారు. తుమ్మల నాగేశ్వర రావు కూడా అలాగే ఓడిపోయారని ఆయన గుర్తు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థికి రావల్సిన ఓట్ల కంటే  తక్కువ ఓట్లు వచ్చాయి.టిఆర్ఎస్ ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థి కి పడ్డాయి. కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓట్ల కంటే  ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కు 116 ఓట్లు మాత్రమే ఉన్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించి టిఆర్ఎస్ లో చేరిన వారితో ఆ పార్టీ బలం 96 కు పడిపోయిందని అన్నారు.

 అయితే ఖమ్మం స్థానంలో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి రాయల నాగేశ్వరరావు కు 242 ఓట్లు దక్కాయి. టిఆర్ఎస్ నుంచి పెద్దఎత్తున కాంగ్రెస్ కు ఓట్లు క్రాసయ్యాయి. అయితే టిఆర్ఎస్ అభ్యర్థికి రావలసిన మెజారిటీ రాలేదు. అంతిమంగా టిఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. టిఆర్ఎస్ అభ్యర్థి తాత మధుకు 450 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి రాయల నాగేశ్వరరావుకు 242 ఓట్లు వచ్చాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని తుమ్మల కీలక వ్యాఖ్యలు చేశారు. అందరూ పార్టీ కోసం పని చేయాలని  నిర్ణయం తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: