తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న మౌలికవసతులు, అందిస్తున్న ప్రోత్సాహకాలతో హైదరాబాద్‌ నగరానికి అంతర్జాతీయ కంపెనీలు క్యూ కడుతున్నాయి. అలాగే ఎలక్ట్రిక్‌ వాహనాల ఉత్పత్తికి, సంబంధిత పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అనేక రాయితీలను, ప్రోత్సాహకాలను అందిస్తున్నది. రిజిస్ట్రేషన్‌, పన్నులలో సబ్సిడీని ఇస్తున్నది. అనేక మౌలిక వసతులను కల్పిస్తున్నది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు ఎలక్ట్రిక్‌ వాహనాల కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టగా, తాజాగా మరో అంతర్జాతీయ కంపెనీ ముందుకు వచ్చింది. ఇందుకు సంబంధించి సోమవారం తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీరంగంలో ప్రఖ్యాతిగాంచిన బ్రిటన్‌కు కంపెనీ వన్‌ మోటో భారత్‌లో తన మొట్టమొదటి అసెంబ్లింగ్‌ యూనిట్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పేందుకు నిర్ణయించుకుంది. రూ. 250 కోట్లతో నగరశివార్లలో సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో యూనిట్‌ ఏర్పాటు చేయనున్నట్టు వన్‌ మోటో ఇండియా కో ఫౌండర్‌, భాగస్వామి సమీర్‌ మొయిదిన్‌, సీఈవో శుభంకర్‌చౌదరి తెలిపారు. ఈవీ వినియోగాన్ని ఎంతో ప్రోత్సహిస్తున్న తెలంగాణ సర్కారుతో ఒప్పందం చేసుకోవడం, హైదరాబాద్‌లో ప్లాంట్‌ ఏర్పాటు చేయనుండటంపై వారు హర్షం వ్యక్తం చేశారు.

తొలిదశలో 40 వేల ఈవీల ఉత్పత్తి..
మొదటి దశలో 40 వేల ఈవీ యూనిట్ల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నామని, దశలవారీగా రెండేండ్లలో లక్ష యూనిట్ల సామర్థ్యాన్ని కంపెనీకి విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నట్లు వన్‌ మోటో తెలిపింది. తొలిదశలో యూనిట్‌ ద్వారా ప్రత్యక్షంగా 500 మందికి.. పరోక్షంగా 2వేల మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని కంపెనీ ఇండియా సీఈవో శుభంకర్‌ చౌదరి వెల్లడించారు. ఈవీల ఉత్పత్తినే కాకుండా విడిభాగాల తయారీ, అప్‌డేట్‌, రీసైక్లింగ్‌పై కూడా కంపెనీ దృష్టి సారించనుంది. ఈ నేపథ్యంలో ఈవీ సర్వీస్‌ సేవలను నిర్వహించేందుకు గాను యువతకు అందుకుతగిన నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇవ్వాలని కూడా యోచిస్తున్నది. తద్వారా గ్రామీణ యువతకు కూడా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇదే సమయంలో పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ జయేశ్‌ రంజన్‌ సమక్షంలో మూడు వన్‌ మోటో మోడల్స్‌ను లాంచ్‌ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ktr